‘సాధారణమైన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’కు అసాధారణ విజయం లభించడం గొప్ప విషయం. ఈ సినిమాపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. పెరుగుతున్న షోస్, టికెట్ సేల్స్ చూస్తే..‘లిటిల్ హార్ట్స్’ సూపర్ హిట్ అని అర్థమైపోతున్నది. ఓ 50 రోజుల వరకూ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావొద్దని ఈటీవీ విన్ వారిని కోరుతున్నా. మలయాళ ‘ప్రేమలు’ చూశాక.. ఇలాంటి సినిమా తెలుగులో కూడా వస్తే బావుండు అనుకున్నా.
ఆ కోరిక ‘లిటిల్ హార్ట్స్’తో తీరిపోయింది.’ అని బన్నీ వాస్ అన్నారు. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయిమార్తాండ్ దర్శకుడు. ఈటీవీ విన్ సమర్పణలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. బన్నీవాస్, వంశీ నందిపాటి సినిమాను తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో బన్నీవాస్ మాట్లాడారు. మంచి కంటెంట్‌తో వస్తే ఊహించనంత కలెక్షన్స్ ఇస్తామని ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారని వంశీ నందిపాటి పేర్కొన్నారు. ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని హీరోహీరోయిన్లు మౌళి తనూజ్, శివానీ నాగరం అన్నారు. ‘ఈ స్క్రిప్ట్ కొందరికి వినిపిస్తే, రోమ్ కామ్స్ ఎవరూ చూడటం లేదన్నారు. ఈ రోజు వాళ్లే ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి?’ అని దర్శకుడు సాయిమార్తాండ్ చెప్పారు. ఇంకా ఈటీవీ విన్ ప్రతినిథులు సాయికృష్ణ, నితిన్ కూడా మాట్లాడారు.