గాలి, నీరు, ఆహారం ఈ మూడూ లేకపోతే ఎలాగైతే బతకలేమో, కరెంట్ లేకపోయినా ప్రస్తుతం అలాగే బతకలేం. అలా తయారైంది సమాజం. అలాంటిది ఓ గ్రామంలో పదిరోజులపాటు కరెంట్ ఉండదు. మరి ఆ ఊరు జనం పరిస్థితేంటి? కరెంట్ పోవడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే మా ‘లైన్‌మ్యాన్’ అంటున్నారు హీరో త్రిగుణ్. ఆయన హీరోగా రఘుశాస్త్రి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది.
ఈ సందర్భంగా త్రిగుణ్ మీడియాతో ముచ్చటించారు. కథే ఈ చిత్రానికి ప్రధానబలమని, కథ నచ్చే ఈ సినిమా చేశానని, వినోదంతోపాటు చక్కని సందేశం కూడా ఇందులో ఉంటుందని త్రిగుణ్ తెలిపారు. ‘నిజానికి ఈ సినిమాను రాక్ ఎంటర్టైనర్స్వారు కన్నడంలో చేయాలనుకున్నారు. నాకు తెలుగులో కాస్త మంచిపేరు ఉందని తెలుగులో కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. నటుడిగా 15ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్నాను. ఇకనుంచి కథల విషయంలో కొత్తగా వెళ్లాలనుకుంటున్నాను. వెబ్ సిరీస్‌లో నటించడానికి కూడా వెనుకాడను. ‘లైన్‌మ్యాన్’ తర్వాత మరికొన్ని ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి.’ అన్నారు త్రిగుణ్.