సినిమాకు ప్రథమార్ధం చాలా ముఖ్యం. ఫస్టాఫ్ బాగుంటే పాస్ మార్కులు వచ్చినట్టే. ఇక ద్వితీయార్ధం కూడా బాగా కుదిరితే ఆ బొమ్మ హిట్టన్నట్టే. సినీ గ్రామర్‌లో ఇదో సాధారణ సూత్రం. ఇది ఫిల్మ్ట్రేడ్కి కూడా వర్తిస్తుంది. ఈ ఏడాదిలో అప్పుడే ఆర్నెల్లు గడచిపోయాయి. దాదాపు తొంభైకి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని హిట్స్ పరిశ్రమలో జోష్ నింపాయి. అదే సమయంలో తెలుగు బాక్సాఫీస్‌కు కీలకమైన వేసవి సీజన్ భారీ చిత్రాల జాడలేక వెలవెలబోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫస్టాఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ఓ లుక్కేద్దాం..
టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పెద్ద సీజన్ అంటే సంక్రాంతే. సినిమా మామూలుగా ఉందని టాక్ వచ్చినా సరే కలెక్షన్స్‌కు కొదువ ఉండదు. అందుకే సంక్రాంతి బరి కోసం అగ్ర హీరోలు పోటీపడుతుంటారు. ఈ ఏడాది బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి రేసులో నిలిచాయి. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. దాదాపు 300కోట్ల రూపాయల వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుదీర్ఘమైన కెరీర్లో వెంకటేష్‌కి ఇదే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. పేరుకు తగినట్టుగానే పండుగపూట ఫుల్‌లెంగ్త్ వినోదాలతో మెప్పించింది. ఇక బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ చిత్రం ‘డాకు మహారాజ్’ సైతం సంక్రాంతి రేసులో సత్తా చాటింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరోవైపు భారీ బడ్జెట్‌తో శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది.
యువ హీరో నాగచైతన్యకిది మెమరబుల్ ఇయర్. ‘తండేల్’ చిత్రంతో ఆయన వందకోట్ల క్లబ్లో చేరాడు. అంతేకాదు పాన్ ఇండియా హీరోగా చైతూకి కొత్త మార్కెట్‌ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. చందూ మొండేటి దర్శకత్వంలో దేశభక్తి, ప్రేమ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ‘తండేల్’ తెలుగుతోపాటు తమిళం, హిందీలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ ప్రథమార్ధంలో సర్ప్రైజింగ్ హిట్‌గా ‘కోర్ట్’ చిత్రాన్ని చెప్పొచ్చు. యువజంట హర్ష్ రోషన్, శ్రీదేవిలను నాయకానాయికలుగా పరిచయం చేస్తూ హీరో నాని నిర్మించిన ఈ సినిమా పెట్టుబడికి ఐదింతల లాభాల్ని తెచ్చిపెట్టింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా దాదాపు రూ. 60 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమాతో రామ్‌జగదీష్ ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును పొందాడు.
ఇక ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన నాని ‘హిట్-3’ ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సరికొత్త మేకింగ్‌తో ప్రేక్షకుల్ని మెప్పించింది. వినోద ప్రధానంగా రూపొందిన ‘మ్యాడ్ స్కేర్’ ‘సింగిల్’ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఆద్యంతం చక్కటి హాస్యంతో నవ్వుల్ని పంచింది. ఈ సినిమా రూ.70 కోట్ల వరకూ వసూళ్లు చేసినట్లు సమాచారం.
శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైనర్ ‘సింగిల్’ కూడా హిట్‌గా నిలిచింది. కార్తిక్‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రూ.40 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. మ్యాడ్స్కేర్, సింగిల్ చిత్రాల్లో కథాబలం కంటే వినోదమే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించింది. తమన్నా ప్రధాన పాత్రలో సంపత్‌నంది దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘ఓదెల-2’ చిత్రం డివోషనల్ థ్రిల్లర్‌గా మెప్పించింది. ఈ చిత్రం రూ.40కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ ప్రథమార్ధంలో భారీ అంచనాలతో విడుదలైన రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఆకట్టుకోలేకపోయింది. కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, నితిన్ ‘రాబిన్‌హుడ్’, విశ్వక్సేన్ ‘లైలా’, సందీప్‌కిషన్ ‘మజాక’, సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’, కిరణ్ అబ్బవరం ‘దిల్రూబా’, ‘భైరవం’, ఇటీవల విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రాలు ఆశించిన ఫలితాల్ని సాధించలేకపోయాయి.
‘కుబేర’, ‘కన్నప్ప’ చిత్రాలు ఈ ప్రథమార్ధానికి అద్వితీయమైన ఎండింగ్ ఇచ్చాయి. సమాజంలోని ఆర్థిక అంతరాలను చర్చిస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ తొలివారంలోనే వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటింది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాలో సామాజికాంశాలు, మానవీయ స్పృహ ప్రేక్షకుల హృదయాల్ని తాకాయి. సీనియర్ హీరో నాగార్జున కెరీర్లో తొలిసారి వందకోట్లు సాధించిన చిత్రంగా ‘కుబేర’ ప్రత్యేకతను చాటింది.
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రన్ అవుతున్నది. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ భక్తిరసాత్మక చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నది. అయితే కలెక్షన్ల లెక్కలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. డబ్బింగ్ చిత్రాల్లో మార్కో, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఛావా ఈ ఫస్టాఫ్‌లో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాయి.
మొత్తంగా గత ఆరు నెలల్లో తెలుగు సినిమా మిశ్రమ ఫలితాలను చవిచూసింది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని చిత్రాలు పరాజయం పాలవగా, కొన్ని చిత్రాలు అనూహ్యమైన విజయాలను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే సెకండాఫ్‌లో బాక్సాఫీస్ పైకి పలు భారీ చిత్రాలు దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. జూలై నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలా పెద్ద హీరోల చిత్రాలు సందడి చేయబోతున్నాయి. నితిన్ ‘తమ్ముడు’, సిద్ధార్థ్ ‘3బీహెచ్‌కే’ చిత్రాలు జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదే నెలలో అనుష్క పాన్ ఇండియా చిత్రం ‘ఘాటీ’ జూలై 11న, పవన్‌కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ 24న రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమా ఆగస్ట్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన ‘జూనియర్’ జూలై 18న విడుదల కానుంది.
ఆగస్ట్‌లో పాన్ ఇండియా చిత్రాల మధ్య పోటీ నెలకొంది. ఆ నెలలో 14న రజనీకాంత్ ‘కూలీ’, ఎన్టీఆర్-హృతిక్‌రోషన్‌ల ‘వార్-2’ ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ఈ రెండూ భారీ యాక్షన్ సినిమాలు కావడం విశేషం. ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ప్రతినాయకుడి పాత్రను పోషించడం కూడా ఆ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నది. రవితేజ ‘మాస్జాతర’ సైతం ఇదే నెల 27న విడుదల కానుంది.
ఈ ఏడాది దసరా బరిలో బాలకృష్ణ, పనవ్‌కళ్యాణ్ పోటీలో ఉండబోతున్నారు. బాలకృష్ణ ‘అఖండ-2’, పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ సెప్టెంబర్ 25న రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇదే నెలలో తేజ సజ్జా ‘మిరాయ్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ విడుదల కానున్నాయి. ఇక అక్టోబర్‌లో ధనుష్ ‘ఇడ్లీ కడాయ్’, రిషబ్‌శెట్టి ‘కాంతార చాప్టర్-1’ ప్రేక్షకుల ముందుకురానున్నాయి. అక్టోబర్ దీపావళి బరిలో సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’, మైత్రీ మూవీ మేకర్స్ ‘డ్యూడ్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, 25న అడవిశేష్ ‘డెకాయిట్’ విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సెకండాఫ్ లిస్ట్‌లో పరిస్థితులను బట్టి కొన్ని చిత్రాలు యాడ్ కావడంతోపాటు, కొన్ని చిత్రాల రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సంక్రాంతి, దసరా తర్వాత వేసవి సీజన్ సినిమాలకు చాలా కీలకం. పరీక్షలు పూర్తయి పిల్లలు, కుటుంబసభ్యులు థియేటర్లకు రావడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ సమ్మర్ సీజన్లో కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, నాని ‘హిట్-3’ లాంటి పెద్దహీరోల చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పవన్‌కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ వాయిదా పడటంతో వేసవి కళ తప్పినట్టయ్యింది. ఈ సమ్మర్ సీజన్ నాని ‘హిట్-3’ విన్నర్‌గా నిలిచింది. ఇక ఈ ప్రథమార్ధంలో వచ్చిన ‘గాంధీతాత చెట్టు’, ‘సారంగపాణి జాతకం’, ‘బాపు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించలేకపోయినా…కథపరంగా మంచి ప్రయత్నాలుగా నిలిచి విమర్శకుల ప్రశంసలందుకున్నాయి.
– సినిమా డెస్క్