Bandla Ganesh | సినీనటుడు, నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేశ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బకాయి రుణాల వసూళ్లలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన కుటుంబానికి చెందిన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్టీ) గతంలో ఇచ్చిన వేలం రద్దు ఉత్తర్వులను కొట్టివేస్తూ, బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియ చట్టబద్ధమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. శ్రీపరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకున్న భారీ రుణానికి బండ్ల గణేశ్, ఆయన తండ్రి, సోదరుడు హామీదారులుగా వ్యవహరించారు. అయితే సంస్థ రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో యూనియన్ బ్యాంక్ సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద రికవరీ చర్యలు ప్రారంభించింది.
ఈ క్రమంలో 2019లో జూబ్లీహిల్స్‌లోని ఆస్తిని స్వాధీనం చేసుకున్న బ్యాంకు, 2022లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఆ ప్రాపర్టీని రూ.8.51 కోట్లకు విక్రయించింది. హైకోర్టులో విచారణ సందర్భంగా యూనియన్ బ్యాంక్ తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. వేలం పూర్తైన తర్వాత బండ్ల గణేశ్ కుటుంబం వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) ద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. రూ.82 కోట్ల ఓటీఎస్ మొత్తంలో వేలం ద్వారా వచ్చిన రూ.8.51 కోట్లను మినహాయించేందుకు బ్యాంకు కూడా అంగీకరించిందని కోర్టుకు వివరించారు. అయితే ఒప్పందానికి అంగీకరించినప్పటికీ, తరువాత డీఆర్టీలో వేలాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేయడం సరైంది కాదని బ్యాంకు తరఫు న్యాయవాది పేర్కొన్నారు. డీఆర్టీ కూడా పూర్తి వివరాలు పరిశీలించకుండా వేలాన్ని రద్దు చేసిందని ఆయన వాదించారు.
బండ్ల గణేశ్ తరఫు న్యాయవాదులు, సంస్థపై ఎన్సీఎల్టీలో దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నందున ఆస్తుల విక్రయంపై మొరటోరియం వర్తిస్తుందని వాదించారు. అయితే బ్యాంకు ఈ వాదనను ఖండించింది.వేలం వేసిన ఆస్తి రుణం తీసుకున్న కంపెనీది కాదని, వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన గ్యారంటర్ల సొంత ఆస్తి అని బ్యాంకు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కార్పొరేట్ దివాలా ప్రక్రియ హామీదారుల వ్యక్తిగత ఆస్తుల రికవరీకి వర్తించదని స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు బ్యాంకు వాదనలతో ఏకీభవించింది. డీఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, యూనియన్ బ్యాంక్ నిర్వహించిన వేలం చట్టబద్ధమని తీర్పు వెలువరించింది.ఈ తీర్పుతో జూబ్లీహిల్స్ ఆస్తి వివాదంలో బండ్ల గణేశ్ కుటుంబానికి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. బ్యాంకు చేపట్టిన రికవరీ చర్యలకు హైకోర్టు మద్దతు ఇవ్వడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.