Salman Khan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద ఇటీవలే కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా నటుడి హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్ చేసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang).. పక్కా స్కెచ్‌తో సల్మాన్‌ను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
సల్మాన్‌ను పన్వెల్ (Panvel)లోని అతని ఫామ్‌హౌస్ వద్ద హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి పలు ఆయుధాలను కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు తెలిపాయి. ఏకే-47 తుపాకులతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరిపేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.
లేదంటే పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లోకి దూసుకెళ్లి సల్మాన్‌పై దాడి చేసి హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు సల్మాన్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 20 మంది రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా సల్మాన్ కదలికలను ఎప్పటికప్పుడు గ్యాంగ్‌స్టర్స్‌కు చేరవేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.
Also Read..
Lok Sabha Elections | కొనసాగుతున్న చివరి దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok Sabha Elections | తొలి రెండు గంటల్లో 11.31 శాతం మేర పోలింగ్