Laapataa Ladies | భారత్ నుంచి ఆస్కార్ పురస్కారాలకు అధికారికంగా ఎంపికైన ‘లాపతా లేడీస్’ చిత్రం రేసు నుంచి నిష్క్రమించింది. మంగళవారం ప్రకటించిన 2025 ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ఈ సినిమాకు చోటు దక్కలేదు. దీంతో భారతీయ సినీ ప్రియులు నిరాశకు గురయ్యారు. అగ్ర నటుడు అమీర్‌ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు ఆయన మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకురాలు. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ పరంగా సాధారణ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం విశేషమైన ఆదరణ దక్కింది. 2001లో జరిగే ఈ కథలో భారతీయ సమాజంలో కట్టుబాట్ల పేరుతో మహిళల స్వేచ్ఛను హరిస్తున్న తీరుని, వారిపై పురుషాదిక్యాన్ని సందేశాత్మకంగా ఆవిష్కరించారు. మహిళా సాధికారత అవశ్యకతను తెలియజేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దురాచారాలను రూపుమాపాలనే అంశాలను చర్చిస్తూ కిరణ్ రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓవైపు వినోదాన్ని పంచుతూనే అంతర్లీనంగా చక్కటి సందేశంతో ఈ సినిమా మెప్పించింది. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆస్కార్ బరి నుంచి నిష్క్రమించడంతో చిత్ర యూనిట్ నిరాశలో మునిగిపోయింది.
షార్ట్‌లిస్ట్‌లో భారతీయులు తీసిన ‘సంతోష్’
ఇంగ్లాండ్‌కు చెందిన షనాహ గోస్వామి ప్రధాన పాత్రలో సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సంతోష్’ యూకే నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. ఉత్తర భారతంలోని గ్రామీణ నేపథ్య కథాంశమిది. పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఓ విధవరాలు గ్రామంలో జరిగిన బాలిక హత్యోదంతాన్ని ఎలా ఛేదించిందన్నదే ఈ చిత్ర కథ. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఆస్కార్ పురస్కారం సాధించే అవకాశాలు ఈ సినిమాకు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
లైవ్ యాక్షన్ కేటగిరీలో ‘అనూజ’
ఆస్కార్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మనదేశం నుంచి ‘అనూజ’ షార్ట్‌లిస్ట్ అయింది. గునీత్‌మోంగా కపూర్ ఈ చిత్రానికి నిర్మాత. న్యూఢిల్లీలోని బట్టల మిల్లులో తన సోదరితో కలిసి పనిచేసే తొమ్మిదేళ్ల అనూజ అనే బాలిక కథ ఇది. బోర్డింగ్ స్కూల్లో విద్యనభ్యసించాలనే అనూజ సంకల్పానికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయన్నదే ఈ సినిమా కథలో ప్రధానాంశం. నిర్మాత గునీత్‌మోంగా కపూర్‌కు ఆస్కార్ పురస్కారాల్లో మంచి రికార్డు ఉంది. గతంలో ఆమె నిర్మించిన ‘పిరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ బెస్ట్ డాక్యుమెంటరీగా అవార్డుని గెలుచుకుంది. 2023 ఆస్కార్ పురస్కారాల్లో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సైతం బెస్ట్ డాక్యుమెంటరీగా అవార్డుని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ బరిలో ఆసక్తికరంగా మారింది.