Kurchi Thatha | ‘కుర్చీ మడతపెట్టి’ అనే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ కృష్ణానగర్ వాసి మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం క్రేజ్ కాదు… ఆయన మృతి చెందాడన్న ఫేక్ న్యూస్. నిన్నటి నుంచి ‘కుర్చీ తాత గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు’ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్తను నిజమని నమ్మిన కొందరు నెటిజన్లు RIP పోస్టులతో సంతాపం కూడా వ్యక్తం చేశారు.అసలు విషయం ఏమిటంటే… ఈ వార్త పూర్తిగా అవాస్తవం. ‘కుర్చీ తాత’ క్షేమంగానే ఉన్నారు. ఈ ఫేక్ ప్రచారంపై ప్రముఖ యూట్యూబర్ వైజాగ్ సత్య స్పందిస్తూ, కుర్చీ తాత భార్యతో కలిసి ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ… “నా భర్త చనిపోలేదు. ఆయన ప్రస్తుతం వరంగల్‌లో ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు” అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే గాంధీ ఆస్పత్రిలో మృతి చెందిన వ్యక్తి కుర్చీ తాత కాదని వైజాగ్ సత్య కూడా స్పష్టం చేశారు. తర్వాత స్వయంగా కుర్చీ తాత మీడియా ముందుకు వచ్చి తనపై వచ్చిన తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను చనిపోలేదు. బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసి మా కుటుంబాన్ని బాధ పెట్టొద్దు. నా మరణ వార్త విని నా భార్య భయపడి బాగా ఏడ్చింది. ఇది చాలా బాధ కలిగించింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై తీవ్రంగా స్పందించారు.
ఓ సాధారణ ఇంటర్వ్యూలో చేసిన డైలాగ్‌తో ‘కుర్చీ తాత’గా మారిన కాలా పాషా… మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో తమన్ వాడిన ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్‌తో మరింత పాపులారిటీ పొందారు. ఆ డైలాగ్‌కు గాను తమన్ నుంచి పారితోషికం కూడా అందడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇలాంటి వ్యక్తిపై తప్పుడు మరణ వార్తలు ప్రచారం కావడం బాధాకరమని నెటిజన్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ వార్తను షేర్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.