‘క్రిష్’ ఫ్రాంఛైజీ చిత్రాలు బాలీవుడ్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. ఈ సిరీస్‌లో భాగంగా త్వరలో ‘క్రిష్-4’ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హృతిక్‌రోషన్ దర్శకత్వం వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాలుగో భాగాన్ని టైమ్ ట్రావెల్ కథాంశంతో దాదాపు 700కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్‌రోషన్ త్రిపాత్రాభినయంలో కనిపిస్తారని తెలుస్తున్నది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికే క్రిష్ ప్రాంఛైజీలో భాగమై మంచి పేరు తెచ్చుకున్న ప్రీతిజింతా..నాలుగో పార్ట్‌లో నటించనుందని తెలిసింది.
గత కొన్నేళ్లుగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ప్రీతిజింతా ‘క్రిష్-4’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుందని తెలిసింది. ప్రియాంకచోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖా తదితరులు ఈ నాలుగో భాగంలో నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు హృతిక్‌రోషన్. ఇది పూర్తయిన వెంటనే ‘క్రిష్-4’ను సెట్స్‌పైకి తీసకెళ్తారని తెలిసింది.