బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది కృతిసనన్. తన అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాల్ని రియాల్టీషోలో ప్రస్తావించడం మంచి పద్దతి కాదని సున్నితంగా హెచ్చరించింది. ‘కృతి ఓ వ్యక్తి ప్రేమలో ఉంది. అతనో పాన్ ఇండియా హీరో. ప్రస్తుతం అతను హైదరాబాద్ షూట్లో పాల్గొంటున్నాడు’ అంటూ కొన్ని నెలల క్రితం ఓ రియాల్టీషోలో ప్రభాస్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు వరుణ్‌ధావన్. ఆయన మాటలతో ప్రభాస్, కృతిససన్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే ఈ విషయం గురించి కృతిసనన్ అప్పుడే వివరణ ఇచ్చింది. ప్రభాస్ తనకు మంచి మిత్రుడని, ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని స్పష్టం చేసింది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్‌ధావన్ మాటలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేసింది కృతిసనన్. ఆమె మాట్లాడుతూ ‘వరుణ్‌ధావన్ అలా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదు. ప్రభాస్‌కు ఫోన్లో ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన కూడా ‘వరుణ్ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది’ అంటూ ఆశ్చర్యపోయారు’ అని కృతిసనన్ చెప్పుకొచ్చింది. ఆమె ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ జూన్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.