Janhvi Kapoor | వయసు చిన్నదే. అయితేనేం, చాలా జీవితాన్ని చూసింది పాతికేండ్ల జాన్వీ కపూర్. తల్లి అందాన్ని, నటననూ వారసత్వంగా పొంది.. వెండితెరను యువరాణిలా ఏలేస్తున్నది. సోషల్ మీడియాలోనూ కోటానుకోట్ల హృదయాలను గెలుచుకున్నది. తన కెరీర్ గురించి, కలల గురించి జాన్వి మనసులో మాట..
ప్రేమకథల్లో నటించడం ఇష్టం. అప్పుడే నేటి తరానికి దగ్గరవుతాను. ఆ తర్వాత కూడా వాళ్లతో కలిసి ట్రావెల్ చేయగలుగుతాను. నేను గమనించినంత వరకు మన హీరోయిన్లు మూసపాత్రలు చేస్తూ ప్రేక్షకులకు చేరువ కావాలని ప్రయత్నిస్తారు. నేను మాత్రం ఆ పంజరంలో ఉండాలనుకోను. అమ్మలా, కరీనా కపూర్‌లా, ఆలియా భట్లా.. విభిన్న పాత్రల్లో జీవిస్తా. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటా.
నేను శ్రీదేవి, బోనీకపూర్‌ల కూతుర్ని కాబట్టి ఎక్కువ రిస్క్ చేయలేనని చాలామంది అనుకుంటారు. ఆ అభిప్రాయం తప్పు. నేను రిస్క్‌కు భయపడను. ఫలితాల్ని యథాతథంగా తీసుకుంటా. నా వెనుక నిలబడటానికి మా ఫ్యామిలీ సిద్ధంగా ఉంది. విమర్శలను మాత్రం ఒంటరిగానే ఎదుర్కొంటాను. నా మీద వచ్చిన విమర్శలకు నేను మాత్రమే సమాధానం
ఇవ్వాలి. నా బదులుగా ఇంకెవరో ఇవ్వడం సరికాదు. ఎత్తుపల్లాల మార్గంలో ప్రయాణిస్తేనే.. మంచిచెడులు తెలుస్తాయి.
అనుకున్నవన్నీ నిజం కావాలని లేదు. కొన్నిసార్లు 99 శాతం కలిసొచ్చినా.. ఒక్క శాతం దురదృష్టమే అంచనాల్ని తలకిందులు చేస్తుంది. కాలంతోపాటు ప్రయాణిస్తే ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరించే గుణం అలవడుతుంది. అమ్మ కూడా ఇలానే అనుకునేది. ఆ ఆలోచనా విధానమే నాకూ అలవాటైంది. కాబట్టే, జయాపజయాలు నన్ను పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నాయి.
ఈ మధ్య సెలెబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాస్తున్నారు. నన్ను కూడా ఒక నెటిజన్ ‘నీకు యాక్టింగ్ రానప్పుడు.. వృథా ప్రయత్నం ఎందుకు చేస్తున్నావ్?’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పడానికి ఒక్క క్షణం చాలు. కానీ.. ‘నేను నటించగలను’ అని నిరూపించుకుంటే అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరమే రాదు. అందుకే, ఉద్దేశ పూర్వకంగానే జవాబు ఇవ్వలేదు.
నేను ఒక విషయాన్ని బాగా నమ్ముతాను. జీవితంలో పైకి రావాలంటే కష్టపడాలి. ఏదీ ఉచితంగా రాదు. కష్టపడకుండా ఏదైనా వచ్చినా.. ఎక్కువ కాలం నిలవదు. అందుకు నేనూ మినహాయింపు కాదు. అందుకే.. తల్లి వారసత్వం, కపూర్ల ఆశీస్సులు ఉన్నా.. స్వశక్తితోనే ఇక్కడ నిలదొక్కుకోవాలని భావించాను. పనిని, సినిమాను ప్రేమిస్తాన్నేను. అమ్మ అంతటిదాన్ని కాలేకపోయినా.. ఆమె వారసురాలు అనిపించుకుంటే చాలు. అదే గొప్ప గుర్తింపు.
‘ఖాళీ సమయాల్లో ఎలా గడుపుతారు?’ అని అడుగుతుంటారు చాలామంది. నేను కూడా అందరిలాంటి మనిషినే. సింపుల్‌గానే ఉంటాను. సమయం దొరికితే జిమ్ చేస్తా. అందం మీద దృష్టి పెడతాను. కంటినిండా నిద్రపోతాను. సోషల్ మీడియా ట్రెండ్స్ గమనిస్తాను. నన్ను నేను మెరుగు పరుచుకోడానికి ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇంటర్వ్యూలు ఇవ్వడమంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ.. అభిమానులకు చేరువ కావడానికి ఇదొక్కటే మార్గం కాబట్టి తప్పదు.