Kishkindhapuri | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’ . హారర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టీజర్ రూపంలోనే మంచి బజ్ క్రియేట్ అయింది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ‘రాక్షసుడు’ తర్వాత మరోసారి బెల్లంకొండ – అనుపమ జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ‘కిష్కిందపురి’ కథ 1989 కాలంలో, ఒక పాత బంగ్లా భవనం ‘సువర్ణమాయ’ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ చిన్మయ్ సలాస్కర్ అందిస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తేనే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అత్యుత్తమంగా ఉన్నాయనే అభిప్రాయం నెటిజన్లలో కలుగుతుంది. హారర్ సినిమాల్లో కీలకమయ్యే భయానక వాతావరణాన్ని వారు ఎంతో బలంగా ప్రెజెంట్ చేశారు. ‘అల్లుడు శ్రీను’తో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో ‘రాక్షసుడు’ ఒక మంచి హిట్టుగా నిలవగా, బాలీవుడ్లో చేసిన ‘ఛత్రపతి’ రీమేక్ ఘోర విఫలమైంది. అదే సమయంలో ఇటీవల విడుదలైన మల్టీ స్టారర్ ‘భైరవం’ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడీ ‘కిష్కిందపురి’ చిత్రంతో పక్కా హిట్ అందుకోనున్నాడని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రేక్షకుల కంటికి కొత్తగా కనిపించే హారర్ థ్రిల్లర్‌గా ఇది నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార్లపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సెప్టెంబర్ 12న ఈ హారర్ థ్రిల్లర్ థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం బెల్లంకొండ కూడా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ చిత్రం మొదలైన 10 నిమిషాల తర్వాత ప్రేక్షకులు తమ ఫోన్స్ పక్కన పెట్టి సినిమాని చాలా ఆసక్తిగా చూస్తారు. ఒకవేళ అలా చేయకపోతే నేను ఇండస్ట్రీని వదిలేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంటే మనోడికి సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉందన్నమాట, అందుకే అలాంటి ఛాలెంజ్ చేశాడని నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.