‘భయపెట్టడం ఓ కళ. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని తప్పకుండా భయపెడతాం. ఒక మంచి దృశ్యం, శబ్దంతో కూడిన అనుభూతితోపాటు ఒక గొప్ప కథ చూశామని సంతృప్తి ఈ సినిమాతో ప్రేక్షకులకు కలుగుతుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ లీనమైపోయి మరీ ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు కౌశిక్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఈ చిత్రంతో తను చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. ఎన్నో కలలతోటి కష్టపడి చేసిన చిత్రమిది. అనుపమ, నేనూ ‘రాక్షసుడు’ సినిమా చేశాం. అది చాలా పెద్ద హిట్. అందరూ ‘రాక్షసుడు 2’ ఎప్పుడని అడుగుతున్నారు. ఆ సినిమాను మించిన సినిమా చేశాం. అదే ‘కిష్కింధపురి’ అన్నారు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా రూపొందిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు.
షైన్ స్క్రిన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడారు. అగ్ర దర్శకులు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఇది విభిన్నమైన చిత్రమని, దర్శకుడు అద్భుతంగా తీశాడని, అందరూ చాలా హార్ట్వర్క్ చేశామని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. సినిమా విజయంపై దర్శకుడు కౌశిక్ నమ్మకం వెలిబుచ్చారు. హారర్ ఎలిమెంట్స్‌తోపాటు బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇదని నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ కూడా మట్లాడారు.