Keerthy Suresh | మలయాళీ భామ కీర్తి సురేష్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చింది. తెలుగులో దసరా, భోళాశంకర్ విజయాలు ఆమె కెరీర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం ఈ భామ తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు ఈ ఏడాది ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నది కీర్తి సురేష్. వరుణ్‌ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరపుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ హిందీలో బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. అక్షయ్‌కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో కీర్తి సురేష్‌ను కథానాయికగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. హీరోయిన్ పాత్ర కోసం అలియాభట్, కియారా అద్వాణీ పేర్లను పరిశీలించిన చిత్ర బృందం చివరకు కీర్తి సురేష్‌ను కన్ఫర్మ్ చేసిందని తెలుస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్లో ఆమె కెరీర్ మరింతగా ఊపందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.