Dude | ఈ ఏడాది దీపావళికి విడుదలైన ‘డ్యూడ్’ (Dude) మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. ప్రదీప్ రంగనాథన్–మమితా బైజు జంటగా, కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మొదటి వారంలోనే టాప్ ట్రెండింగ్లో దూసుకెళ్లి మరోసారి హిట్ రేంజ్ పెంచుకుంది. అయితే సినిమా విజయవంతంగా థియేటర్లు, ఓటీటీలో పరుగులు తీస్తున్న సమయంలోనే దర్శకుడి స్పందన ఒక పెద్ద వివాదానికి దారితీసింది.
సినిమా చూసిన ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్, ‘డ్యూడ్’లోని కొన్ని సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దర్శకుడు కీర్తీశ్వరన్కు డైరెక్ట్ మెసేజ్ పంపాడు. ముఖ్యంగా హీరోయిన్ మమితా హీరో మోకాళ్లపై కూర్చుని ప్రేమను వ్యక్తం చేసే సీన్ గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో “అది సాధారణం” అన్న వ్యాఖ్యను ఆయన తప్పుబట్టాడు. నిజమైన స్నేహితుల మధ్య అలాంటి ప్రవర్తన ఉండదు, అది సాధారణం కాదు, సినిమాలో కథనం సరిగా లేదనిపించింది, సన్నివేశాలు రీల్స్లా ఉన్నాయి అంటూ సూచనలు ఇచ్చాడు. ఈ సూచనలకు కీర్తీశ్వరన్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం ఇంటర్నెట్లో పెద్ద దుమారమే రేపుతోంది.
దర్శకుడు.. నాకు మెసేజ్ పంపడం కన్నా… నీ పని నువ్వు చూసుకో? అనే రీతిలో రిప్లై ఇచ్చినట్టు బయటపడింది. ఈ స్క్రీన్షాట్లు ఇన్స్టాగ్రామ్లో వైరల్ కాగా, నెటిజన్లు దర్శకుడి అహంకారాన్ని తీవ్రమైన పదజాలంతో తప్పుపడుతున్నారు. కొత్త దర్శకుడిగా ఉంటూ ఇంత ఓవర్యాక్ట్ ఎందుకు?, డబ్బులు ఖర్చు పెట్టి చూసిన ప్రేక్షకుడి ఫీడ్బ్యాక్కైనా గౌరవం లేదా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘డ్యూడ్’ ఓటీటీలో మంచి స్పందన పొందుతున్న వేళ ఈ వివాదం చిత్రబృందానికి అన్వాంటెడ్ హెడేక్గా మారింది. దర్శకుడి రిప్లైపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ విషయంపై స్పందిస్తారా? లేక చిత్ర బృందం అధికారిక క్లారిటీ ఇస్తుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో, నెటిజన్లలో చర్చించబడుతున్నాయి.