Vijay | తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం విజయ్‌పై విమర్శల వర్షం కురిసింది. ముఖ్యంగా, బాధితులను ఆయన వ్యక్తిగతంగా పరామర్శించలేదన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విమర్శలకు స్పందించిన విజయ్, ప్రతి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. అనంతరం బాధిత కుటుంబాలను చెన్నైకి ఆహ్వానించి వారితో భేటీ అయ్యారు.
అయితే, ఈ పరిహారం చుట్టూ ఇప్పుడు మరో వివాదం చెలరేగింది. తొక్కిసలాటలో మరణించిన కోడంగిపట్టి గ్రామానికి చెందిన రమేష్ భార్య సంగవి, విజయ్ ఇచ్చిన రూ.20 లక్షలను తిరిగి ఇచ్చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ .. “కరూర్ తొక్కిసలాటలో నా భర్త ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ స్వయంగా వచ్చి మమ్మల్ని ఓదారుస్తారని ఆశించాం. ఆయన వీడియో కాల్లో మాట్లాడుతూ ఆర్థిక సహాయం ముందుగా తీసుకోవాలని చెప్పారు. కానీ మేము ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం. మా పేరుతో బంధువులు సమావేశానికి వెళ్లారు. నాకు తెలియకుండానే నా ఖాతాలో డబ్బు జమ చేశారు. మాకు డబ్బు ముఖ్యం కాదు, గౌరవం ముఖ్యం అని అని వ్యాఖ్యానించింది.
ఈ ఘటనతో విజయ్ ఇచ్చిన పరిహారాన్ని తిరస్కరించిన బాధితురాలు సంగవి పేరు ప్రస్తుతం తమిళనాడంతా హాట్ టాపిక్‌గా మారింది. బాధితులను స్వయంగా విజయ్ కలవకపోవడం పట్ల అభిమానులు, రాజకీయ వర్గాలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విజయ్ ఆర్థికంగా సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటారని అభిమానులు చెబుతుండగా, మరోవైపు “పరిహారానికి మించి వ్యక్తిగత సానుభూతి అవసరం” అని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.