ఇటీవలకాలంలో అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ విషయంలో అనుకోని సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా నిర్మాతల తాలూకు ఆర్థికపరమైన సమస్యలు విడుదల సమయంలో ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. గతవారం ‘అఖండ-2’ విషయంలో ఇవే సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. అదే రీతిలో కార్తి తాజా చిత్రం ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో రానుంది) రిలీజ్‌ను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
అయితే గతంలో పారిశ్రామికవేత్త అర్జున్ లాల్ సుందర్ వద్ద స్టూడియో గ్రీన్ అధినేత, నిర్మాత జ్ఞానవేల్ రాజా పది కోట్ల్లు అప్పు తీసుకున్నారని, ఆ మొత్తానికి ప్రస్తుతం వడ్డీతో సహా 21.78కోట్లు అయిందని, ఆ డబ్బుని చెల్లించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది.
డబ్బు చెల్లింపు విషయంలో జ్ఞానవేల్ రాజాకు ఇప్పటికే అనేక అవకాశాలిచ్చామని, అయినా చెల్లించలేకపోయారని, ఆయన ఆస్తులను జప్తు చేయాలని అర్జున్‌లాల్ సుందర్ తరపు న్యాయవాది వాదించారు. తాజా వివాదం నేపథ్యంలో సినిమాను త్వరలోనే విడుదల చేస్తామంటూ నిర్మాణ సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి.