Jani Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక కాంగ్రెస్ స్వాగతించింది. ఇది సాహసోపేతమైన చర్యగా అభినందించింది. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినే గుండూరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. లైంగిక వేధింపులతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో అవార్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం వైఖరిని తాను స్వాగతిస్తున్నానన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను ప్రజలు సహించరని.. అలాంటి వారిపై సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో మహిళల పాత్ర పెరుగుతుందని.. ఈ క్రమంలో వారిపై వేధింపులు అరికట్టి ఇబ్బందులు లేని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వ బాధ్యత అని.. అందుకే కేంద్ర నిర్ణయాన్ని అభినందిస్తున్నామన్నారు. అయితే, ఈ విషయంలో బీజేపీ ఎందుకు ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన ప్రశ్నించారు. మాజీ సీఎం యడ్యూరప్పపై సైతం పోక్సో కేసు నమోదైందని.. సీఐడీ జూలైలో చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. ప్రస్తుతం విచారణ జరగాల్సి ఉందన్నారు. మాజీ సీఎంతో పాటు ముగ్గురు సహచరులపై సీఐడీ 700 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసిందన్నారు.
ఇందులో సాక్ష్యాలను తారుమారు చేయడం, కేసును కప్పిపుచ్చడం తదితర అభియోగాలున్నాయన్నారు. అయితే, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. కనీసం కేసు విచారణ జరిగే వరకు ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించలేరా? మహిళలపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఒత్తిడికి తలొగ్గిందా? అని ప్రశ్నించారు. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌కు ఇచ్చిన అవార్డును రద్దు చేశారని.. మరోవైపు యడ్యూరప్పపై ఆరోపణలు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు.