Homebound Movie | బాలీవుడ్ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’(Homebound). ఈ సినిమాకు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ నిర్మించాడు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ (Martin Scorsese) ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఈ చిత్రం విడుదలకు ముందే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ఎట్టకేలకు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చందన్ కుమార్ (విశాల్ జేత్వా), మహ్మద్ షోయబ్ (ఇషాన్ ఖత్తర్) అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితాల కథ ఆధారంగా వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వీరిద్దరూ మంచి జీవితం కోసం ఆరాటపడుతుంటారు. వారికి సమాజంలో ఎదురయ్యే వివక్ష పేదరికం నుంచి బయటపడి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో పోలీసు ఉద్యోగం కోసం ఇద్దరూ ప్రయత్నిస్తారు. పోలీసు విభాగంలో 2.5 మిలియన్ల మంది దరఖాస్తుదారులలో కేవలం 3,500 మంది మాత్రమే ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పటికీ, యూనిఫాం ధరించి, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కలలు కంటారు. అయితే చందన్ పరీక్షలో ఉత్తీర్ణుడైతే, మహ్మద్ విఫలమవుతాడు. చందన్ తన ఉద్యోగ నియామకం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, మహ్మద్ ఒక ఎలక్ట్రానిక్స్ డీలర్ వద్ద పనిలో చేరి, తన హిందూ సహోద్యోగుల గౌరవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాడు.
2020లో కోవిడ్-19 విజృంభించి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయానికి, ఈ ఇద్దరు యువకుల జీవితాలు విడిపోయి, మళ్లీ కలుసుకుంటాయి. ఈ ప్రయాణంలో, వారి స్నేహం, ఆశలు, నిరాశలు, సామాజిక అసమానతలు, వ్యక్తిగత పోరాటాలు వంటి అనేక అంశాలను దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరపై చూపించాడు. అట్టడుగు వర్గాల ప్రజలు గౌరవంగా, ఆనందంగా జీవించడానికి పడే కష్టాలను ఈ చిత్రం ఎంతో సున్నితంగా, వాస్తవికంగా చిత్రీకరించింది. జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్ర కూడా కథలో కీలకమైనది.