Kantara Chapter 1 | భారతీయ సినీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘కాంతార చాప్టర్ 1’ మరోసారి వార్తల్లో నిలిచింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ ప్రీక్వెల్, 2022లో విడుదలైన ‘కాంతార’ కథకు ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రంకి అన్ని వర్గాల ప్రజలు ఆదరణ చూపించడంతో భారీ విజయాన్ని సాధించింది. విడుదలతోనే దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం మొత్తం కలెక్షన్లు ₹800 కోట్లను దాటాయి. విమర్శకులు, ప్రేక్షకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు అక్టోబర్ 31 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా, హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా వచ్చింది.
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) నియమాల ప్రకారం హిందీ వెర్షన్ థియేటర్ రిలీజ్ తర్వాత కనీసం 8 వారాలు పూర్తైనా తరువాతే OTTలో విడుదల చేసేందుకు అనుమతి ఉంటుంది. ఆ ప్రకారం ఇప్పుడు హిందీ డబ్బింగ్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దక్షిణ భారతంలోనే కాదు, ఉత్తర భారత ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్లోనే ₹200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించడం విశేషం. ఈ విజయం ‘కాంతార చాప్టర్ 1’ను పాన్ ఇండియా హిట్గా నిలిపింది. హిందీ వర్షెన్ని చూడాలనుకున్న వారు కూడా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ అందించిన సంగీతం ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంది. దేవతా ఆరాధన, గ్రామీణ సంప్రదాయాలు, అడవి సంస్కృతి, యాక్షన్ అంశాలను సమతూకంగా మేళవించిన రిషబ్ శెట్టి దర్శకత్వం చిత్రానికి ప్రధాన బలం. థియేటర్లలో భారీ విజయం సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు హిందీ ప్రేక్షకులని అలరించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రావడంతో మరింత మంది ఈ సినిమాను వీక్షించే అవకాశం పొందుతున్నారు.