Kangana Ranaut | ముంబై 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో, ప్రాణాలకు తెగించి పోరాడిన నిజమైన హీరోల కథతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata – The Unseen Heroes). ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుండగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. 2008లో ఉగ్రవాదులు ముంబైలోని కామా హాస్పిటల్‌పై దాడి చేసినప్పుడు, అక్కడ దాదాపు 400 మంది రోగులను, గర్భిణీలను, చిన్న పిల్లలను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టిన నర్సులు, వార్డ్ బాయ్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది వీరోచిత పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం. ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఒక సాధారణ నర్సు పాత్రలో కనిపించబోతున్నారు. ఇంట్లోనూ, సమాజంలోనూ పెద్దగా గుర్తింపు లేని ఒక సాధారణ మహిళ, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతటి సాహసానికి ఒడిగట్టిందనేది ఈ ట్రైలర్లో ఎమోషనల్‌గా మరియు ఉత్కంఠభరితంగా చూపించారు.
మనోజ్ తపారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్, కంగనా రనౌత్‌కు చెందిన మణికర్ణిక ఫిల్మ్స్ మరియు పరమహంస క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో కంగనాతో పాటు గిరిజా ఓక్, స్మితా తాంబే, అమృతా నామ్‌దేవ్, ఈషా డే ముఖ్య పాత్రలు పోషించారు.