Kangana Ranaut | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రానికి దేశ రాజధాని ఢిల్లీలో పన్ను మినహాయింపు (టాక్స్ ఫ్రీ) లభించింది. ఈ చిత్ర విడుదలకు ముందు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకు కంగనా రనౌత్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు పలువురు విశిష్ట అతిథులు విచ్చేశారు.
ఈ స్క్రీనింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ‘భారత్ భాగ్య విధాత’ చిత్రాన్ని ఢిల్లీలో పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసేలా ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ చిత్రం సాంస్కృతిక, సామాజిక ప్రాధాన్యతను ఆమె ఎంతగానో కొనియాడారు. దేశభక్తి, అంకితభావం, సేవ అనేవి కేవలం యూనిఫామ్ ధరించిన వారికే పరిమితం కాదని, ప్రతి భారతీయ పౌరుడిలోనూ ఈ భావన ఉంటుందని ఈ సినిమా నిరూపించిందని సీఎం అన్నారు. కష్టకాలంలో ప్రతి భారతీయుడు దేశం కోసం ముందుకు వస్తాడని, మన దేశ పౌరులే నిజమైన ‘భారత్ భాగ్య విధాత’ అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు నటి కంగనా రనౌత్‌పై సీఎం రేఖా గుప్తా ప్రశంసల జల్లు కురిపించారు. పార్లమెంటులో సినిమా రంగానికి, భారత ప్రజల శ్రేయస్సుకు కంగనా ఒక బలమైన గొంతుకగా నిలిచారని, ఆమె కేవలం పార్లమెంటులోనే కాకుండా వెండితెరపై కూడా తన అభిప్రాయాలను బలంగా వినిపిస్తారని కొనియాడారు. ఇలాంటి అద్భుతమైన కథలను ఎంచుకుంటున్నందుకు కంగనాకు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి నుండి లభించిన ఈ గౌరవానికి కంగనా రనౌత్ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి స్క్రీనింగ్‌కు విచ్చేసినందుకు మరియు సినిమాను టాక్స్ ఫ్రీగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు. రేఖా గుప్తా నాయకత్వంలో ఢిల్లీలో పర్యావరణ, వాయు కాలుష్య సమస్యలు తగ్గి, నగరం ఎంతో అద్భుతంగా మారిందని కంగనా ప్రశంసించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.