Kangana Ranaut | తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది అగ్ర కథానాయిక కంగనారనౌత్. తాజాగా ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన పేరు ప్రస్తావించకుండానే విమర్శలను ఎక్కుపెట్టింది. ‘పద్మావత్’ చిత్రంలో ఆయన ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పింది.
పెద్ద దర్శకుల సినిమాల్లో నాయికల పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని, వారికి ఓ పావుగంట మాత్రమే స్క్రీన్ టైమ్ కేటాయిస్తారని, వారి పాత్రల్ని తక్కువ చేసి చూపిస్తారని చెప్పుకొచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “పద్మావత్’లో అవకాశం వచ్చినప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వమని దర్శకుడిని అడిగా. అందుకు ఆయన నిరాకరించాడు.
సినిమాలో నా పాత్ర ఏంటని అడిగితే ‘అద్దం ముందు ముస్తాబవుతున్న కథానాయికను చూసి హీరో ప్రేమలో పడతాడు’ అంటూ ఒక్క లైన్లో కథ చెప్పాడు. ఆ సినిమా చూసినప్పుడు కూడా హీరోయిన్ సినిమా మొత్తం అద్దం ముందే కూర్చొని కనిపిస్తుంది. దాంతో ఆయన చెప్పిన మాటలు నిజమే అనిపించాయి. హీరోయిన్ల విషయంలో దర్శకుల ఆలోచనా విధానం ఇలా ఉంటే ఏ దర్శకుడితో పనియాలి’ అంటూ కంగనా రనౌత్ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె మాటలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.