‘తమిళభాష నుంచే కన్నడం పుట్టింది..’ అంటూ చెన్నైలో జరిగిన ‘థగ్‌లైఫ్’ ఈవెంట్లో మాట జారిన కమల్‌హాసన్‌కి కన్నడిగుల వేడి ఇంకా తాకుతూనే ఉంది. మరోసారి ఎక్కడా కన్నడభాషపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా బెంగళూరు కోర్టు కమల్‌హాసన్‌కు మధ్యంతర ఉత్తర్యులు జారీ చేసింది. కన్నడ భాషకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నిషేధం విధించాలంటూ కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్ దాఖలు చేసిన పిటీషన్ని శుక్రవారం విచారించిన బెంగళూరు కోర్టు, విచారణ అనంతరం ఈ ఉత్తర్యులను జారీ చేసింది.
‘కన్నడపై భాషాపరమైన ఆధిపత్యాన్ని ప్రకటించేలా వ్యాఖ్యలు చేయకూడదు. దీనిపై ఎలాంటి పోస్టులు పెట్టకూడదు. కన్నడ సాహిత్యం, సంస్కృతికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదు.’ అని ఆదేశిస్తూ బెంగళూరు కోర్టు ఉత్తర్యులను జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్ట్ 30కి వాయిదా వేసింది. ఆ రోజు కమల్‌హాసన్ కూడా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.