Kajol | బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది సీనియర్ నటి కాజోల్. గతకొంతకాలంగా సినిమాలకు విరామం తీసుకున్న ఆమె ‘ది గుడ్ వైఫ్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అరంగేట్రం చేయబోతున్నది. చామన ఛాయ రంగు కలిగిన కాజోల్ ఈ మధ్యకాలంలో చక్కటి నిగారింపుతో మెరిసిపోతూ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆమె స్కిన్‌కు సంబంధించిన సర్జరీ చేయించుకుందనే వార్తలొచ్చాయి. వీటిపై కాజోల్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో నల్లగా ఉన్నానని, కళ్లద్దాలు పెట్టుకుంటుందని అవహేళన చేసేవారు.
అయితే విమర్శల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి కెరీర్లో రాణించాను. ఒకప్పుడు వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉంటూ ఎండలో గడపాల్సి రావడంతో నా శరీరం నల్లగా కనిపించేది. అయితే గత ఐదారేళ్లుగా ఇంటిపట్టునే ఉంటున్నా. ఎక్కువగా ఎండ తగలకపోయేసరికి స్కిన్ ట్యాన్ కాలేదు. అందుకే నా ముఖ వర్చసు మరింత మెరుగుపడి ఫెయిర్‌గా కనిపిస్తున్నా. అంతేకాని రంగు కోసం ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు’ అని పేర్కొంది.