KA Paul | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆయనపై ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో విచారణ జరిపారు ఈడీ అధికారులు. పలువురు సినీ, టీవీ ప్రముఖులపై దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండను కూడా కీలక ప్రశ్నలతో ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ, తాను ప్రమోట్ చేసిన యాప్ బెట్టింగ్ యాప్ కాదని, అది గేమింగ్ యాప్ మాత్రమేనని స్పష్టం చేశారు. A23 అనే గేమింగ్ యాప్‌కి ప్రచారం చేసిన విషయాన్ని అంగీకరిస్తూ, “దేశంలో గేమింగ్ యాప్‌లు అనేక రాష్ట్రాల్లో లీగల్. కానీ నేను ప్రచారం చేసిన ఈ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు” అని తెలిపారు.
ఈడీ అధికారులన్నింటికీ సమాధానం చెప్పాను. నా బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా సమర్పించాను. నాకే తెలియకుండా ఈ వివాదంలో నా పేరు లాగబడింది అని విజయ్ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండ తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆ ప్రకటనల ద్వారా సంపాదించిన డబ్బును బాధితులకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు.ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. చదువుకోని వారు, సామాన్యులు అత్యాశతో బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొడుతున్నారు. 99 శాతం మందికి ఏమీ లాభం ఉండదు. కానీ ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు మాత్రం లక్షల్లో డబ్బులు వచ్చాయి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
విజయ్ దేవరకొండకు మనస్సాక్షి ఉంటే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, అని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల ప్రభావంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనల నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు సినీ, టీవీ, సోషల్‌మీడియా రంగాల్లో ప్రాచుర్యం ఉన్న 29 మంది ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. వీరిలో విజయ్ దేవరకొండ,ప్రకాశ్ రాజ్,ప్రణీత,నిధి అగర్వాల్,రానా దగ్గుబాటి,మంచు లక్ష్మి,శ్రీముఖి,నయన పావని,,అనన్య నాగళ్ల,సిరి హనుమంతు,రీతూ చౌదరి,యాంకర్ శ్యామల,టేస్టీ తేజ, హర్షసాయి, తదితరులు ఉన్నారు. ఈ ప్రముఖులకు బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయని, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు. మనీలాండరింగ్ కోణాన్ని కూడా అనుమానిస్తున్న ఈడీ, కేసును మరింత లోతుగా విచారిస్తోంది.