తమిళ సినీదిగ్గజం కె.భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా భాగ్యరాజ్ సాధించిన విజయాలు అనితరసాధ్యాలనే చెప్పాలి. 75 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించిన భాగ్యరాజ్, పాతిక సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో గొప్ప చిత్రాలకు కథలు అందించారు. భాగ్యరాజ్ అసలు పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని వెళ్లన్ కోయిల్‌లో కృష్ణస్వామి, అమరావతియమ్మ దంపతులకు 1953లో ఆయన జన్మించారు. భాగ్యరాజ్‌కు 1981లో తొలి వివాహం ప్రవీణతో జరిగింది. ఆమె రెండేళ్లకే కామెర్ల వ్యాధితో మరణించగా, 1984లో హీరోయిన్ పూర్ణిమా జయరాంని రెండో వివాహం చేసుకున్నారు భాగ్యరాజ్. వారికి శరణ్య భాగ్యరాజ్(కుమార్తె), శంతన్ భాగ్యరాజ్(కుమారుడు)సంతానం.
భాగ్యరాజ్‌కు చిన్నతనం నుంచి రచనలపై మక్కువ ఎక్కువ. అంతేకాదు, ఎంజీ రామచంద్రన్‌కి ఆయన వీరాభిమాని. సినిమాలపై ఆసక్తితో మద్రాసు చేరుకున్న భాగ్యరాజ్, అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు తమిళ దర్శకుడు జి.రామకృష్ణన్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు. ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ భారతీరాజాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అదే ఆయన కెరీర్‌కు గొప్ప మలుపని చెప్పాలి. భారతీరాజా తొలి సినిమా ‘పదునారు వైదినిలే’(1977)లో ఓ చిన్న పాత్ర పోషించారు కె.భాగ్యరాజ్. ఆ తర్వాత ఆయన దగ్గరే ‘కిళక్కే పోగుమ్ రైల్'(తెలుగులో తూర్పు వెళ్లే రైలు), ‘టిక్ టిక్ టిక్’ తదితర చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. భారతీరాజా బ్లాక్‌బస్టర్ ‘సిగప్పు రోజాక్కళ్'(తెలుగులో ‘ఎర్రగులాబీలు’) సినిమాకు తొలిసారి సంభాషణలు అందించారు. అక్కడ్నుంచి రచయితగా భాగ్యరాజ్ ప్రయాణం మొదలైంది. తమిళంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు రచయితగా ఆయన వ్యవహరించారు.
‘సువరిల్లద చిత్తిరంగల్'(1979) చిత్రంతో దర్శకునిగా మారి, తమిళతెరపై అద్భుతాలు సృష్టించారు. భారతీరాజా ‘పుదియ వార్పుగళ్'(1979) సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా తమిళనాడు రాష్ట్రప్రభుత్వ అవార్డును కూడా భాగ్యరాజ్ అందుకున్నారు. ‘పుదియ వార్పుగళ్’ చిత్రం భాగ్యరాజ్‌కి స్టార్ స్టేటస్‌ని తెచ్చిపెట్టింది. దాంతో ఆయనే సొంతంగా చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి, స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ఎన్నో చిత్రాలను నిర్మించారు. హాస్య చతురతతో కూడిన భాగ్యరాజ్ రచనా శైలిని ఇష్టపడని తమిళులు ఉండరు. ఆయన హీరోగా నటిస్తూ, ఆయన పాత్రపై ఆయనే సైటైర్లు వేసుకుంటూ, ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం భాగ్యరాజ్ ైస్టెల్. కె.భాగ్యరాజ్ కథలు, స్వీయ దర్శకత్వంలో ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులోనూ పునర్నిర్మితమయ్యాయి.
బాపూరమణల ‘రాధా కల్యాణం’(1981) చిత్రాన్ని ఇష్టపడని తెలుగువారుండరు. ఆ చిత్రానికి కథకుడు భాగ్యరాజానే. ఆయన తమిళంలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ‘ఆంధా 7 నాట్కల్'(1981) చిత్రం ఆధారంగానే ‘రాధాకల్యాణం’ తెరకెక్కింది. ఇక భాగ్యరాజ్‌ను నటుడిగా తెలుగువారికి చేరువ చేసిన సినిమా ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’. ఆయన స్వీయ దర్శకత్వంలోనే 1982లో తమిళనాట విడుదలైన ఈ సినిమా.. అదే పేరుతో తెలుగులో అనువాదమై ఇక్కడ కూడా ఘనవిజయాన్ని సాధించింది.
తమిళంలో భాగ్యరాజ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ముందానై ముడిచ్చు’(1983). ఈ సినిమాలోని నటనకు గాను ఉత్తమనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు భాగ్యరాజ్.
ఈ కథతోనే దర్శకుడు జంధ్యాల తెలుగులో ‘మూడుముళ్లు’(1983) చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికీ చాలామందికి ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ అది. ఆ తర్వాత ఆయన స్వీయ దర్శకత్వంలోనే నటించిన తమిళ చిత్రం ‘చిన్న వీడు’(1985) తెలుగునాట ‘చిన్న ఇల్లు’ పేరుతో అనువాదమై భారీ విజయాన్ని అందుకుంది. అక్రమ సంబంధాల నేపథ్య కథాంశంతో రూపొందిన వివాదాస్పద చిత్రంగా అప్పట్లో ఈ సినిమా చర్చనీయాంశమైంది.
భారతీరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ఖైదిన్ డైరీ’(1985) చిత్రానికి కథకుడు భాగ్యరాజానే. ఆ సినిమా ‘ఖైదీవేట’గా తెలుగులో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శంకర్ ‘భారతీయుడు’ సినిమాకు ‘ఖైదీవేట’ కథే ప్రేరణ. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్ స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు. విశేషమేంటంటే.. ఈ కథతోనే బాలీవుడ్లో అమితాబ్ హీరోగా ‘ఆఖ్రీ రాస్తా’ చిత్రాన్ని తెరకెక్కించి, బాలీవుడ్‌లోనూ దర్శకుడిగా విజయకేతనం ఎగురవేశారు భాగ్యరాజ్. నిజానికి భాగ్యరాజ్‌కు హిందీ, ఇంగ్లిష్ భాషలు పెద్దగా తెలియవు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో ఈ కథను అమితాబ్‌కి వినిపించి, ఒప్పించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
1986లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్లో అప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. అలాగే అనిల్‌కపూర్ నటించిన ‘వో 7 దిన్’ చిత్రానికి కూడా కథకుడు భాగ్యరాజానే. భాగ్యరాజ్ కెరీర్లోనే మెమరబుల్ హిట్‌గా చెప్పుకోవాల్సిన సినిమా ‘ఎంగ చిన్నరాసా’(1987). ఈ సినిమాకు కథకుడు, దర్శకుడు, హీరో కూడా ఆయనే. ఒక్క తమిళనాట మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా తీసిన ప్రతి భాషలోనూ సంచలన విజయం సాధించిన కథ ఇది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తొలుత తెలుగులో ‘చిన్నరాజా’ పేరుతో అనువదిస్తే అఖండ విజయాన్ని అందుకున్నది. ఆ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత మళ్లీ అదే కథతో వెంకటేశ్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ ‘అబ్బాయిగారు’ సినిమా తీశారు.
మళ్లీ సూపర్‌హిట్. అదే కథతో హిందీలో అనిల్ కపూర్ హీరోగా ‘బేటా’ అని తీస్తే బాలీవుడ్‌లోనూ బంపర్‌హిట్. రవిచంద్రన్ హీరో కన్నడంలో ‘అన్నయ్య’ అని తీస్తే అక్కడా సూపర్‌హిట్. ఇలా అన్ని భాషల్లోనూ ఆయన ‘ఎంగ చిన్నరాసా’ కథ విజయఢంకా మోగించింది. ఇక వెంకటేశ్ ‘సుందరకాండ’(1992) ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమా కూడా తమిళంలో భాగ్యరాజా చేసిన ‘సుందరకాండం’(1992) సినిమా ఆధారంగానే తెరకెక్కింది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయిగా విజయాలను అందుకున్న భాగ్యరాజా పొలిటికల్ మాత్రం విజయాన్ని సాధించలేకపోయారు. 1989లో ఎమ్జీఆర్ మరణానంతరం ఆయన ‘ఎమ్జీఆర్ మక్కల్ మున్నేట్ర కజగం’ పేరుతో పార్టీని స్థాపించారు. 1991 ఎన్నికల్లో పోటీచేయగా, కేవలం ఒక్క అభ్యర్ధి మాత్రమే ఆ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ విధంగా ప్రారంభ దశలోనే ఆ పార్టీ విఫలమైంది.
కె.భాగ్యరాజ్ అనగానే.. ఎన్నో అద్భుతమైన కథలు కంటిముందు కదులుతాయి. ఎన్నో అద్భుతమైన పాత్రలు మనల్ని పలకరిస్తాయి. అత్యద్భుతమైన కథనాలతో కథంతొక్కిన స్క్రీన్‌ప్లే మాంత్రికుడాయన. కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లేగా కితాబులందుకున్న లెజెండరీ స్టోరీ టెల్లర్ కె.భాగ్యరాజ్. ఆయన కథలకు ప్రాంతాలతో పనిలేదు. భాషలతో ప్రమేయం లేదు. కాలంతో నిమిత్తం లేదు. సంగీత దర్శకుడిగా కూడా సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఇటీవలే తెలుగులో వచ్చిన 35 చిన్న కథ కాదు, కుబేర చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించిన భాగ్యరాజ్.. ఆయన గురువు భారతీరాజా మరణించిన 17వ రోజే కాలం చేయడంతో దక్షిణభారత చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
భాగ్యరాజ్ మృతి వార్త విని నా హృదయం ముక్కలైంది. గురువారం ఖుష్భు కుమార్తె పెళ్లి వేడుకలో మేమిద్దరం కలిశాం. సరదాగా జోకులు వేసుకుంటూ ఫొటోలు కూడా దిగాం. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉండే ఆయన మరణించడం నిజంగా జీర్ణించుకోలేకపోతున్నా. స్క్రీన్‌ప్లే రచయితగా, నటుడిగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
– చిరంజీవి
భాగ్యరాజ్ నాకు మంచి మిత్రుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన దర్శకత్వంలో తమిళంలో నటించాను. చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి ఆయన. ఆయన మనమధ్య లేరనే వార్త నమ్మలేకపోతున్నా
– సుమన్