అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ మన్మీత్ ప్రీతమ్‌సింగ్ అరోరా ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపారు.
సోషల్‌మీడియా, ఇ-కామర్స్ వేదికగా ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు, హక్కులకు భంగం కలిగించేలా కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరఫు న్యాయవాది జె.సాయిదీపక్ న్యాయస్థానాన్ని కోరగా, పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్ట్.. 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లేలా ఉన్న అభ్యంతరకర పోస్టులను ముందు తొలగించి, ఆ తర్వాతే న్యాయస్థానానికి హాజరు కావాలని సదరు సోషల్‌మీడియా వేదికలను హైకోర్ట్ ఆదేశించింది. ఈ నెల 22కు తదుపరి విచారణను వాయిదా వేశారు. గతంలో ఇదే వ్యవహారంపై కోర్టును ఆశ్రయించిన ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, చిరంజీవి, అజయ్‌దేవగన్, నాగార్జున, ఐశ్యర్యరాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ కూడా ఉన్నారు.