Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీకపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’లో హీరోయిన్గా టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. హీరో రామ్చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో కూడా హీరోయిన్గా ఎంపికయిందీ అభినవ అతిలోక సుందరి.
ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో కాబోయే భర్త ఎలా ఉండాలనే ప్రశ్న ఎదురైంది జాన్వీకి. దానికి ఈ ముద్దుగుమ్మ ఏం చెప్పిందో తెలుసా..? నా కలలను కూడా తన కలలుగా భావించేవాడు భర్తగా కావాలంటూ మనసులో మాటను బయటపెట్టింది జాన్వీ. ‘నాకు ఎప్పుడూ అండగా ఉండాలి. నేను సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.
నవ్విస్తూ ఉండాలి. నేను ఏడుస్తుంటే పక్కనే ఉండి ధైర్యం చెప్పాలి’ అని కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చిందీ భామ. తన స్నేహితుడు శిఖర్ పహాడియాతో ఈ బ్యూటీ డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తిరుమల శ్రీవారిని జంటగా పలుమార్లు దర్శించుకున్నారు. అంతేకాదు, తిరుమలలోనే పెండ్లి చేసుకుంటామని జాన్వీ ఇప్పటికే వెల్లడించింది కూడా.