వ్యక్తిగత విషాదాన్ని సైతం అపహాస్యం చేస్తూ సోషల్మీడియా వేదికల్లో ట్రోలింగ్ చేసే ధోరణి పెరిగిపోతున్నదని, నేటి మీడియా సంస్కృతిలో నైతిక విలువలు పూర్తిగా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది కథానాయిక జాన్వీకపూర్. ఒకప్పుడు ప్రజల పట్ల సున్నితంగా, ఉదారంగా వ్యవహరించిన మీడియా నేడు టీఆర్పీలు, వ్యూస్ కోసం హుందాతనాన్ని కోల్పోతున్నదని పేర్కొంది. తన తల్లి మరణించిన సందర్భంలో తాను సోషల్మీడియాలో పెట్టిన పోస్టులపై వెకిలి కామెంట్లతో అపహాస్యం చేశారని జాన్వీకపూర్ చెప్పింది. ‘అలాంటి కామెంట్ల వల్ల నా బాధ రెట్టింపయ్యింది. డిజిటల్ మీడియా ఉధృతిలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే జాడ్యం ఎక్కువైంది. కుటుంబ విషాదాలను కామెడీగా ప్రచారం చేస్తున్నారు. నా తొలి సినిమా ప్రచారంలో మా అమ్మను గుర్తుచేసుకుంటూ చెప్పిన మాటలపై కొందరు మీమ్స్ చేశారు. ఆ రోజుల్ని ఇప్పటికీ మర్చిపోలేను. అమ్మ దూరమై దుఃఖంలో ఉన్న ఓ కూతురి మాటల్ని అపహాస్యం చేస్తారని ఎవరైనా ఊహించగలరా? ధర్మేంద్ర మరణం విషయంలో కూడా కొందరు అలాగే ప్రవర్తించారు. అమ్మ మరణం మీద అసత్యాల్ని ప్రచారం చేశారు. ఆ టైంలో టీవీ చూడ్డానికి కూడా నేను భయపడ్డాను’ అని జాన్వీకపూర్ చెప్పింది.