తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పింది అందాల భామ జాన్వీకపూర్. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన ఒర్హాన్తో జాన్వీకపూర్ గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నది. విదేశీ విహారయాత్రల్లో ఈ జంట చెట్టపట్టాలేసుకొని షికారు చేసిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఒర్హాన్ తనకు మంచి స్నేహితుడని చాలా సందర్భాల్లో చెప్పింది జాన్వీకపూర్. తాజాగా ఓ మాసపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒర్హాన్ గురించి ఈ భామ మాట్లాడిన మాటలు విన్నవారు ఈ జంట ప్రేమలో ఉన్నారనే నిర్ణయానికొస్తున్నారు.
ఒర్హాన్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే కాదని , అతను పక్కనుంటే ఏదో తెలియని భరోసాగా ఉంటుందని జాన్వీకపూర్ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘అతని సమక్షంలో ప్రతి క్షణం ఆనందంగా అనిపిస్తుంది. అతనితో ఏ విషయాన్నైనా పంచుకుంటాను. ఏదైనా సహాయం చేయాల్సివస్తే ఒర్హాన్ ఎప్పుడూ ముందుంటాడు. అతను పక్కనుంటే మా ఇంట్లో ఉన్నాననే సురక్షితమైన భావన కలుగుతుంది’ అని చెప్పింది. జాన్వీకపూర్ మాటలు పరోక్షంగా తన మనసులోని ప్రేమను వ్యక్తం చేసేలా ఉన్నాయని, ఈ జంట ఖచ్చితంగా రిలేషన్లో ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు.