Janhvi Kapoor | బాలీవుడ్ యంగ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2025లో తొలిసారి సందడి చేసింది. ఈ సందర్భంగా తన తల్లి శ్రీదేవిని తలచుకొని కన్నీరు పెట్టుకుంది. కేన్స్ తమ కుటుంబం, తల్లి శ్రీదేవికి ఎంతో ఇష్టమైన ప్రదేశమని, ఇక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని యంగ్ బ్యూటీ పేర్కొంది. వోగ్ ఇండియా కోసం చేపట్టిన ‘గెట్ రెడీ విత్ మీ’ కార్యక్రమంలో జాన్వీకపూర్ పాల్గొంది. ఈ సందర్భంగా కేన్స్ సిటీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తన తల్లికి ఇష్టమైన ప్రదేశమని.. హాలీడే కోసం వస్తుండేదని.. వరుసగా మూడునాలుగు సార్లు ఇక్కడే వేసవి సెలవులను గడిపామని జాన్వీ తెలిపింది.
శ్రీదేవి కెరీర్‌లోని కీలమైన మైల్‌స్టోన్స్, అవార్డులను సైతం ఇక్కడే కుటుంబంతో సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పింది. అవార్డు వచ్చినా.. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ లాంటి సినిమా ఏదైనా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయినా.. కుటుంబమంతా కలిసి వేడుక చేసుకునేవాళ్లమని పేర్కొంది. ఆమె జీవితంలోని కీలకమైన ఘట్టాలను తాము ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నామని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. కేన్స్‌కు ఈ సారి తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్ లేకుండానే వచ్చానని.. శ్రీదేవి లేకుండా రావడం విచిత్రంగా.. బాధగా ఉందని తెలిపింది. జీవితంలోని ముఖ్యమైన సందర్భాలన్నింటికీ తనను తీసుకువెళ్లేదని.. ఇప్పుడు తన తల్లిని మిస్ అవుతున్నానని కన్నీటి పర్యంతమైంది.
తన సినీ ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో తల్లి శ్రీదేవి కీలక పాత్ర పోషించిందని.. ఆమె లేకుండా కేన్స్‌లో ఉండడం ఏదో వెలితిగా అనిపిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గత వారం అట్టహాసంగా మొదలైన ఈ ఫెస్టివల్‌కి ప్రపంచంలో ఉన్న ఫేమస్ నటీనటులు అందరు హాజరై సందడి చేసే విషయం తెలిసిందే. హాలీవుడ్ నటీమణులు ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరై రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే తొలిసారి జాన్వీ కపూర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్‌కార్పెట్‌పై అరంగేట్రం చేసి.. ప్రపంచాన్నంతా తనవైపునకు తిప్పుకుంది. ఈ నెల 20న రెడ్ కార్పెట్ అరంగేట్రం కోసం డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన రోజ్ కలర్ గౌను ధరించి సందడి చేసింది.