IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో భారీ స్కోరింగ్ మ్యాచ్‌లు, ఉత్కంఠ పోరాటాలు ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థ్రిల్లింగ్ మ్యాచ్‌లను కళ్లారా చూసేందుకు స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. వేలకు వేలు పెట్టి టికెట్లు కొని.. మైదానంలో వాలిపోతున్నారు ఫ్యాన్స్. అందుకే వీళ్లను ఎంటర్టైన్ చేసేందుకు భారత క్రికెట్ బోర్డు సినీ తారలతో ప్రదర్శనలు ఇప్పిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. అయితే.. అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మను చూసుకునేందుకు నటి తన ఫెర్మార్మెన్స్ను రద్దు చేసుకుందని సమాచారం.
గువాహటి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మార్చి 26, బుధవారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆమె తల్లి కిమ్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేరిన ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
దాంతో, తన కెరియర్ ఆసాంతం వెన్నుతట్టి ప్రోత్సహించిన అమ్మను దగ్గర ఉండి చూసుకోవాలనుకుంది జాక్వెలిన్. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులకు తెలియజేసిన అందాల తార.. తాను గువాహతిలో స్టేజ్ షోకు అందుబాటులో ఉండనని వెల్లడించింది. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉన్న జాక్వెలిన్‌ను పలువురు బాలీవుడ్ హీరోలు పరామర్శించేందుకు వెళుతున్నారు. ఈ కష్ట సమయంలో ఆమెకు ధైర్యం చెప్పినవాళ్లలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు.
Jacqueline