2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత..మళ్ళీ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల వైపు వెళ్లలేదు. కనీసం ఈ 13 సంవత్సరాల్లో ఆయన పాలిటిక్స్ గురించి పట్టించుకున్నది కూడా లేదు. తన సినిమాలతో మాత్రమే బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ (jr NTR). మధ్యలో ఎన్ని సార్లు రాజకీయంగా ఆయనను కదిలించాలని చూసినా కూడా సున్నితంగా తప్పించుకున్నాడు. చివరికి 2019 ఎన్నికలలో తన సొంత అక్క పోటీ చేసినా కూడా ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు జూనియర్.
మధ్యలో ఒకసారి మాత్రం ఆయన పార్టీ మారుతున్నాడని ప్రచారం జరుగుతున్న సమయంలో షూటింగ్ ఆపుకొని వచ్చి.. తను ప్రాణాలతో ఉన్నంతవరకు తాత పెట్టిన పార్టీలోనే ఉంటాను.. ఎప్పుడు ఏ అవసరం వచ్చిన ముందుకు వస్తాను.. అంతేకానీ పార్టీ మాత్రం మారనని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ చాలా సంవత్సరాలకు ఇప్పుడు ఈయన చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University)కి వైఎస్ఆర్ (YSR)పేరు పెట్టడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ‘ఇద్దరూ గొప్ప నాయకులని..వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పెట్టడం వల్ల ఆయనకు కొత్తగా వచ్చేది లేదు..ఈయనకు పోయేది లేదు అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం ఒక పేరు మార్పు వల్ల తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కున్న కీర్తి ప్రతిష్టలు తగ్గిపోవు.. ఆయన కీర్తిని చెరిపేయలేరు ‘ అంటూ ట్విట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్.
పెద్దాయన మనవడిగా ఆయన లెగసీని కాపాడడానికి ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేశాడు.. కానీ ఇది మాత్రం పొలిటికల్ గా హీట్ పుట్టిస్తుంది. ఇప్పుడు కాకపోయినా.. ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావడం ఖాయం అని ఇప్పటికే పార్టీలో ఉన్న కొందరు సీనియర్లు చెబుతున్న మాట. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ స్పందించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. మరి ఇది రాబోయే కాలంలో ఎలాంటి మార్పులకు తెరతీస్తుందో చూడాలి.
— Jr NTR (@tarak9999) September 22, 2022