రవితేజ కథానాయకుడిగా ఆధ్యాత్మిక, కుటుంబ భావోద్వేగాల కలబోతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్న ‘ఇరుముడి కట్టు’ అనే తొలి గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు కల్యాణ్‌చక్రవర్తితో కలిసి దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యాన్నందించారు. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ పాటను అనంతు ఆలపించారు. ‘మండలదీక్ష ముగిసింది, మాలకు అర్థం తెలిసింది. శబరికొండ పిలిచింది.. మణికంఠుని చేర పదమంది.. కట్టు కట్టు ఇరుముడి కట్టు, ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు’ అంటూ ఆద్యంతం భక్తి భావనలతో ఈ పాట సాగింది.
ఆయ్యప్ప మాలధారణతో మండల దీక్ష చేపట్టిన భక్తుడు ఇరుముడి కట్టుకొని శబరిమల వరకు సాగించిన పవిత్ర ప్రయాణానికి ఈ పాట అద్దం పట్టింది. విజువల్స్ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కన్నులపండువగా అనిపించాయి. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్‌ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.