షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. నటీనటులెవరో పూర్తిగా ఖరారు కాలేదు. హీరో నితిన్ అంటున్నారు. హీరోయిన్గా కీర్తి సురేశ్ ఖారారైందంటున్నారు. అధికారికంగా మాత్రం ఇప్పటివరకూ ఏ ప్రకటనా రాలేదు. కానీ.. ‘ఎల్లమ్మ’ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి. వేణు యల్దెండి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. నిర్మాత దిల్‌రాజు ‘బలగం’ సినిమాకోసం వేణుకు లిమిటెడ్ బడ్జెట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. కానీ ‘ఎల్లమ్మ’కు మాత్రం అన్ లిమిటెడ్ బడ్జెట్ అంటున్నారట. ఆ కథను దిల్ రాజు అంత నమ్మారన్నమాట. రంగస్థల కళాకారుల నేపథ్యంలో ఓ గ్రామదేవత చుట్టూ ఈ కథ నడుస్తుందని సమాచారం. దర్శకుడు బలగం వేణు.. ఈ సినిమా విషయంలో పగడ్బందీగా వ్యవహరిస్తున్నారని ఇన్సైడ్ టాక్.
తన కథ, కథనాలు ఏ మాత్రం బయటకు పొక్కకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారట బలగం వేణు. షూటింగ్ మొదలయ్యాక లొకేషన్లో సెల్ ఫోన్లు కూడా ఉండటానికి వీల్లేదని తన టీమ్‌కు హుకుం జారీ చేశారట. స్క్రిప్ట్ విషయంలో వేణు చాలా సంతృప్తితో ఉన్నారని, త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఇదిలావుంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో నితిన్ ‘ఎల్లమ్మ’ గురించి మాట్లాడారు ‘ ఎంత ఎఫర్ట్ పెడితే అంత పేరు తెచ్చిపెట్టే కథ ‘ఎల్లమ్మ’. ఇందులో హీరోగానో, స్టార్‌గానో కాక ఒక నటుడిగా పనిచేస్తున్నా.’ అని చెప్పారు. ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్న విషయం తెలిసిందే. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.