‘నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమాల్లో ‘షష్టిపూర్తి’ ఒకటి. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. అందుకే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.’ అని డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. అర్చన, రూపేష్, ఆకాంక్షసింగ్ ప్రధాన పాత్రధారులు. పవన్ప్రభ దర్శకుడు. రూపేశ్ నిర్మాత. రేపు సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ‘మనం ఏ పాత్ర పోషించినా ఆ పాత్రే గుర్తుండాలనేది నా సూత్రం. ఇది నా అయిదో జనరేషన్. ఇప్పటికీ నాకోసం ‘షష్టిపూర్తి’ లాంటి పాత్రలు రాస్తున్నారంటే అది నా అదృష్టం.
తల్లిదండ్రుల పెళ్లిని పిల్లలు చూడలేరు. అందుకే అమ్మనాన్నలకు ‘షష్టిపూర్తి’ చేసి వారి కోరిక తీర్చుకుంటారు. ఇది ఓ గొప్ప సాంప్రదాయం. ఈ నేపథ్యంలో వచ్చే కథల్నీ, పాత్రల్నీ అస్సలు మిస్సవ్వకూడదనే ఈ సినిమాలో నటించాను. కళాకారుడికి ఆకలి, దాహం తీరదు. ఎన్ని గొప్పపాత్రలు చేసినా ఇంకా కావాలని కోరుకుంటాడు. నేనూ అంతే. ఇందులో అద్భుతమైన పాత్ర దొరికింది. మంచి సహనటులు, ఇళయరాజా సంగీతం, చక్కని కథ ఇంతకు మించి ఇంకేం కావాలి. ‘షష్టిపూర్తి’ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుంది.’ అని నమ్మకం వ్యక్తం చేశారు రాజేంద్రప్రసాద్.