‘ఇటీవల కాలంలో నేను విన్న ప్రేమకథల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. ‘ఆషికి’వంటి మనసును కదిలించే లవ్‌స్టోరీలో నటించాలన్నది నా చిరకాల స్వప్నం. బాలీవుడ్లో హీరో కార్తీక్ ఆర్యన్ లవ్‌స్టోరీస్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్. ఆయనతో ఒక ప్రేమకథా చిత్రంలో నటించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది రాశీఖన్నా. గత కొంతకాలంగా తెలుగులో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో ప్రస్తుతం తమిళ, హిందీ భాషలపై దృష్టిపెట్టింది పంజాబీ సుందరి రాశీఖన్నా. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ప్రేమకథా చిత్రాలు ఎప్పుడూ బోర్ కొట్టవు.
ఓ నటిగా కూడా నేను రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌ను బాగా ఇష్టపడతాను. అయితే ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చిన ప్రేమకథలు చాలా రొటీన్‌గా అనిపించాయి. హృదయాన్ని తడిమే ఉద్వేగాలు ఏ కథలో కనిపించలేదు. ఇక ప్రేమకథా చిత్రాల్లో కార్తిక్ ఆర్యన్‌ను మించిన ఛాయిస్ ఎవరూ లేరన్నది నా అభిప్రాయం. లవ్‌స్టోరీస్ వరకు అతను నా ఫేవరేట్ హీరో’ అని చెప్పింది. ప్రస్తుతం రాశీఖన్నా తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలే విడుదలైన హిందీ వెబ్‌సిరీస్ ‘ఫర్జీ’లో చక్కటి నటనతో ఆకట్టుకుంది.