I Bomma | హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు, అంతర్జాతీయ పైరసీ మాఫియా కీలక కార్మికుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. “పట్టుకోండి చూద్దాం” అంటూ సవాల్ విసిరిన రవిని పోలీసులు చివరికి కటకటాల బాట పట్టించారు. భారీ మొత్తంలో హార్డ్ డిస్క్‌లు, డేటా స్వాధీనం చేసుకున్నారు. సీపీ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్ నుంచి తాజా బ్లాక్‌బస్టర్ ఓజీ వరకు దాదాపు 21,000 సినిమాలను రవి పైరసీ చేశాడు. ఫిల్మ్ ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఈ రాకెట్ వెనుక అసలు ‘కింగ్‌పిన్’ రవేనని నిర్ధారణ అయ్యింది.
సినిమాలు ఫ్రీగా చూపిస్తూ, బ్యాక్‌డోర్ ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరించినట్లు దర్యాప్తులో తెలిసింది. బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన లావాదేవీలు, డేటా ట్రాన్స్ఫర్ నెట్‌వర్క్‌ను కూడా పోలీసులు బయటపెట్టారు. 2022లో రవి భారత పౌరసత్వం వదిలి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశపు సిటిజన్‌షిప్ తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ హైదరాబాద్, విశాఖలోని ప్రాపర్టీలు అమ్ముకుని మళ్లీ విదేశాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్న వేళ ఖాకీలు ఎంట్రీ ఇచ్చి అరెస్ట్ చేశారు.ఆయనని తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. దర్యాప్తు ప్రకారం రవి మైండ్‌సెట్‌లో మార్పుకు వ్యక్తిగత అవమానాలే కారణమట.
కాలేజ్ రోజుల నుంచి మోసపూరిత వాతావరణం, 2016లో జరిగిన మతాంతర ప్రేమ వివాహం, భార్య, అత్త నుంచి ఆర్థిక అవమానాలు కారణాలుగా తెలుస్తుంది. డబ్బు సంపాదించటం నీ వల్ల కాదంటూ భార్యతోపాటు అత్త కూడా పదే, పదే అనడంతో అతను మానసికంగా ఇబ్బందులకు లోనయ్యాడని తెలుస్తుంది. అయితే ఈ ఒత్తిళ్లే అతడిని త్వరగా డబ్బు సంపాదించే దారిలోకి నెట్టేశాయని పోలీసులు భావిస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన రవికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండటంతో ఐబొమ్మ, బప్పం టీవీ లాంటి వెబ్సైట్లు సృష్టించాడు. బెట్టింగ్ యాప్స్ వరకు కార్యకలాపాలు విస్తరించాడు. రవి అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా సేవలు నిలిపేస్తున్నట్లు ఐబొమ్మ సైట్ ప్రకటించింది. అయితే కేసు ఇక్కడితో ముగియలేదు.వెబ్సైట్ నిర్వాహకులపై కూడా స్క్రూ బిగిస్తున్నారు అధికారులు. రవిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు పోలీసులపై మీమ్స్ పోస్ట్ చేయడంతో, వారిపై కూడా ఓ కన్నేసారు.