Dharmendra | బాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇక లేరనే వార్త భారతీయ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచినప్పటి నుంచి అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌లో ఉన్నారు. అయితే, తన జీవిత భాగస్వామిని కోల్పోయిన బాధను నిశ్శబ్దంగా అనుభవించిన హేమ మాలిని, మొదటిసారి సోషల్ మీడియా ద్వారా హృదయాన్ని హత్తుకునే సందేశాన్ని పంచుకున్నారు. ట్విట్టర్లో తన భర్తని తలచుకుంటూ హేమమాలిని ఎమోషనల్‌గా ఇలా రాశారు. ధరమ్జీ నాకు భర్త మాత్రమే కాదు… నా ఇద్దరు పిల్లలకు ప్రేమను పంచిన తండ్రి. నాకు స్నేహితుడు, మార్గదర్శి, కవి, దారిచూపే వెలుగు. కష్టసుఖాల్లో నా వెన్నంటే నిలిచిన శక్తి ఆయనే.
ఆమె ప్రతి మాట కూడా తన ఆవేదనను మరింతగా ప్రతిబింబిస్తూ ఉంది. వ్యక్తిగతంగా ధర్మేంద్ర ఎంత పెద్ద స్టార్ అయినా అత్యంత సరళ స్వభావం కలిగిన వారని, అదే ఆయనను అందరికీ ఎంతో దగ్గర చేసినదని హేమమాలిని గుర్తుచేసుకున్నారు. ఆయన లేని లోటు మాటల్లో చెప్పలేనిది. ఈ ఖాళీ జీవితాంతం అలాగే ఉంటుంది. ఇన్నేళ్ల బంధం తర్వాత జ్ఞాపకాలే ఓదార్పుగా మిగిలాయి అంటూ ఆమె బాధను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌తో పాటు ఆమె ధర్మేంద్రతో ఉన్న పలువురు మధుర జ్ఞాపకాల ఫోటోలను కూడా షేర్ చేయడంతో అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు.
డిసెంబర్ 8న ఆయన 90వ ఏట అడుగుపెట్టాల్సి ఉండగా, అంతకు ముందే ఇలా జరిగిపోవడం నిజంగా హృదయవిదారకం. పవన్ హన్స్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తి కాగా, బాలీవుడ్ అంతా ఆయనకు నివాళులర్పిస్తోంది. హేమమాలిని తన సందేశంలో చివరగా..ఆయన దూరమైనా జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి అంటూ హృదయాన్ని తాకే విధంగా రాసుకొచ్చింది . ఈ క్లిష్ట సమయంలో హేమమాలిని ధైర్యంగా ఉండాలని ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ధర్మేంద్ర ఇక లేరనే విషయాన్ని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.