Sai Pallavi | అగ్ర కథానాయిక సాయిపల్లవి నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ఆమె నటించబోయే తెలుగు సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ భామ హిందీలో రామాయణ పార్ట్-1 , ఏక్దిన్ సినిమాలతో బిజీగా ఉంది. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే సాయిపల్లవి తెలుగు స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నదని చెబుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ అమ్మడు ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించనుందని తెలిసింది. స్వాతంత్రోద్యమ కాలంలో ఓ సైనికుడి ప్రేమకథగా ‘ఫౌజీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నది. కథానుగుణంగా సినిమాకు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఆయువుపట్టులా ఉంటుందట. ఇందులో ప్రభాస్ ప్రేయసిగా సాయిపల్లవిని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలాంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.