గుంటూరు రౌడీ రమణ…అతనిది కేర్లెస్ యాటిట్యూడ్. ఎవ్వరినీ లెక్కచేయడు. ‘చూడంగానే మజా వచ్చిందా? హార్ట్‌బీట్ పెరిగిందా? ఈల ఏయాలనిపించిందా?..ఇదీ తన గురించి తాను ఇచ్చుకున్న ఇంట్రడక్షన్. ఇంతకి రౌడీ రమణ గుంటూరులో చేసే హంగామా ఏమిటో తెలియాలంటే ‘గుంటూరు కారం’ సినిమా చూడాల్సిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. ఆదివారం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో గుంటూరు రమణగా మహేష్‌బాబు పాత్రను పరిచయం చేశారు.
‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథగా వదిలేశారని అంటున్నారు..దానికి మీరేం చెబుతారు’ అనే వాయిస్ ఓవర్‌తో ఎమోషనల్‌గా మొదలైన టీజర్..యాక్షన్, కామెడీ అంశాలతో ఆకట్టుకుంది. మహేష్‌బాబు తనదైన శైలి యాక్షన్, సంభాషణలతో మెరిశారు. ‘వాడొక బ్రేకుల్లేని లారీ..ఎవడాపుతాడు’ అనే ప్రకాష్‌రాజ్ డైలాగ్ హీరో రమణ యాటిట్యూడ్‌ను తెలియజెప్పింది. ‘రమణ..నీ లైఫ్ ఒక మిరాకిల్ రా బాబు..’ అంటూ మహేష్ తన గురించి చెప్పుకునే పంచ్‌తో ట్రైలర్ ముగిసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. తమన్ సంగీతాన్నందించారు.