గైడ్ ఇంగ్లిష్ వెర్షన్.. అమెరికాలో అస్సలు అడలేదు. హిందీ వెర్షన్… భారత్‌లో మొదట్లో ఎందుకో ఆదరణ పొందలేదు. వారాలు గడిచాయి. అమెరికా ప్రేక్షకుల్లో మార్పు రాలేదు. కానీ, మనదేశంలో రుతుపవనాల కన్నా వేగంగా ‘గైడ్’పుంజుకుంది. ఆ సినిమా ఆడుతున్నచోట వర్షాలు పడుతున్నాయన్న వార్తలు వచ్చాయి. ఎంటీ గైడ్ సినిమా? ఇంగ్లిష్‌లో ఎందుకు ఫ్లాప్ అయింది? హిందీలో ఎందుకంత హిట్టయ్యింది?
‘గాతా రహే మేరా దిల్’
‘తేరే మేరే సప్నే..’
‘దిల్ ఢల్ జాయే హాయ్..’
‘పియా తోసే నైనా లాగే రే..’
‘వహా కౌన్ హై తేరా ముసాఫిర్’
‘ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై..’
ఇలా గైడ్ పాటలన్నీ ఎవర్గ్రీన్ లిస్ట్‌లో చోటు దక్కించుకొని ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
తేరే దుఃఖ్ అబ్ మేరే..
మేరే సుఖ్ అబ్ తేరే..
నీ దుఃఖం నాది..
నా సంతోషం నీది..
ఇలా ఎవరైనా మాటిస్తే..
ఎంత భరోసాగా ఉంటుంది!
ఆర్కే నారాయణ్ రాసిన నవల ‘గైడ్’ చదివిన తర్వాత.. దేవానంద్‌కు ఇలాంటి భరోసానే కుదిరింది. దానిని సినిమాగా తీయాలని అనిపించాక ఇంకా భరోసా వచ్చింది! ఇండో-అమెరికన్ కొలాబరేషన్లో ప్రయోగాత్మకంగా ఓ సినిమా తీయాలనుకున్నారు. ఎన్నో కథలు అనుకున్నారు. చివరికి ‘గైడ్’ తీయాలనుకున్నారు! అదీ ఇంగ్లిష్‌లో!! హాలీవుడ్ టీమ్ భారత్‌లో అడుగుపెట్టింది. ‘గైడ్’ నవలను సినిమాకు అనుకూలంగా మార్చడమూ జరిగింది. దేవానంద్‌కు ఫర్వాలేదు అనిపించింది. ఏక కాలంలో ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లో చిత్రీకరించాలని భావించారు. ఇంగ్లిష్ స్క్రిప్ట్ చూశాక దేవ్ సోదరుడు విజయ్ ఆనంద్‌కు అది అస్సలు నచ్చలేదు.
‘పాశ్చాత్య ప్రేక్షకులకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ స్క్రిప్ట్ హిందీలో తీస్తే.. నీకు చెడ్డపేరు వస్తుంది. నేను దర్శకత్వం వహించను’ అని కుండబద్దలు కొట్టాడు గోల్డీ (విజయ్ ఆనంద్). మరో సోదరుడు చేతన్ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించాడు దేవ్. అన్న మాట కాదనలేక అన్యమనస్కంగానే ఓకే అన్నాడు. ఇంతలో ‘భారత్-చైనా’ యుద్ధం నేపథ్యంలో చేతన్ అనుకున్న ప్రాజెక్టు ‘హకీకత్’ షూటింగ్‌కు సైనిక అధికారుల నుంచి అనుమతులు రావడంతో ‘గైడ్’ నుంచి తప్పుకొన్నాడు. మధ్యలో మరో దర్శకుణ్ని అనుకున్నారు. కానీ, కుదర్లేదు. చివరికి, గోల్డీ తాను అనుకున్న మార్పులతో తీయడానికి ఒప్పుకొంటేనే దర్శకత్వం వహిస్తానన్నాడు. ఆ మార్పులు దేవ్‌కు భరోసా ఇవ్వడంతో సరే అన్నాడు. కథానాయికగా ఎందరెందరినో అనుకున్నా చివరికి వహీదా రెహమాన్ ఓకే అయింది.
1965లో విడుదలైన ‘గైడ్’ సినిమా కథలోకి వెళ్తే.. రాజు టూరిస్ట్ గైడ్. రోజి దేవదాసీ బిడ్డ. కారణాంతరాల వల్ల వయసు పైబడిన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. సంసార సుఖం ఉండదు. దాన్నంత సమస్యగా భావించదామె. కానీ, ఆమెకు నృత్యం అంటే ప్రాణం. గజ్జె కడితే ఆమె ముసలి భర్త అగ్గిమీద గుగ్గిలం అవుతుంటాడు. భార్య ఇష్టాన్ని ఖాతరు చేయడు. ఈ దంపతులు ఒకసారి రాజు గైడ్‌గా పనిచేస్తున్న పర్యాటక కేంద్రానికి వస్తారు. రాజు మంచితనం రోజీని కదిలిస్తుంది. పైకి బలవంతంగా నవ్వుతున్న ఆమె మనసులో బాధను గుర్తిస్తాడు రాజు. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. రాజు సమక్షంలో ‘ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై.. ఆఫ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై’ (ఈ రోజు మళ్లీ పుట్టాలన్న కోరిక పుడుతున్నది.. మళ్లీ పోవాలన్న ఉద్దేశం కలుగుతున్నది..) అంటూ ఉత్సాహంతో ఉరకలేస్తుంది. ఎందుకంటే.. చాన్నాళ్లూ పంజరంలో ఉన్న రోజి.. బయటి ప్రపంచంలోకి వచ్చిన ఆనందంలో స్వేచ్ఛగా పుట్టాలని, ఇష్టంగా పోవాలని కోరుకోవడంలో ఆశ్చర్యం ఏముంది! రోజులు గడిచే కొద్దీ… రోజి దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. చివరికి భర్తతో తెగదెంపులు చేసుకొని రాజును ఆశ్రయిస్తుంది రోజి.
‘తేరే మేరే సప్నే అబ్ ఏక్ రంగ్ హై… జహా భీ లే జాయే రహే హమ్ సంగ్ హై’ ‘నీ, నా స్వప్నాలు ఇప్పుడు ఒక్కటే.. ఇది ఎక్కడికి దారి తీసినా.. మనం కలిసే ఉంటాం’ అని రోజీకి అభయమిస్తాడు రాజు. దీనికి కొనసాగింపుగానే ‘ప్రపంచం అడ్డుపడ్డా.. మనం విడిపోము’ అని కూడా హామీ ఇస్తాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నమూ చేస్తాడు. నృత్యంపై ఆసక్తి ఉన్న రోజీని ఎంతో ప్రోత్సహిస్తాడు. నాట్య ప్రదర్శనలు ఏర్పాటుచేసి ఆమెకు ఆకాశమంత గుర్తింపు తీసుకొస్తాడు. పేరుతోపాటు విపరీతంగా డబ్బు వస్తుంది. ఆదాయం కోసమే రాజు తనను ఆదరిస్తున్నాడన్న అపోహ ఆమెలో మెదలుతుంది. రోజి తనను అపార్థం చేసుకుంటున్నదని రాజు భావిస్తాడు. చేయని దొంగతనం అతని మీద పడుతుంది.
తను నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం ఉన్నా… మౌనంగా ఉండటంతో రాజుకు జైలు శిక్ష పడుతుంది. రోజులు దొర్లిపోతాయి. శిక్ష కాలానికన్నా ఆరు నెలల ముందే విడుదల అవుతాడు రాజు. మళ్లీ తన ఊరికి, తన మనుషుల మధ్యకు వెళ్లొద్దని భావిస్తాడు. ఒంటరిగా బయల్దేరుతాడు. గమ్యం లేకుండా అలా వెళ్తూనే ఉంటాడు. అలా వెళ్తూ, వెళ్తూ కరువుతో అల్లాడుతున్న ఓ గ్రామానికి చేరుకుంటాడు.
ఓ గుడి మీద ఆకలితో, అలసటతో నిద్రలోకి జారుకున్న రాజుకు ఓ సాధువు కాషాయ వస్త్రం కప్పుతాడు. అతను నిద్ర లేచే సరికి ఆ గ్రామానికి చెందిన ఓ ఆసామి.. ‘సామీ’ అంటూ రాజు పాదాలపై పడతాడు. తన కూతురు పెండ్లికి ఒప్పుకోవడం లేదని మొరపెట్టుకుంటాడు. రాజు తనకు తోచిందేదో ఆ అమ్మాయికి చెబుతాడు.
ఆమె తన తండ్రి చూసిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకొంటుంది. గ్రామస్తులంతా రాజు మాటలో ఏదో మహిమ ఉందని బలంగా నమ్ముతారు. అప్పట్నుంచి రాజును దైవంగా భావిస్తూ ఉంటారు. వర్షాలు లేక తమ ప్రాంతమంతా కరువు కోరల్లో చిక్కుకుపోయిందని ఓ వ్యక్తి రాజుతో చెప్పుకొంటాడు. రాజు ఎప్పటిలాగే యథాలాపంగా.. పన్నెండు రోజులు నిరాహార దీక్ష చేస్తే.. వర్షం పడుతుందని గతంలో ఎక్కడో, ఎవరికో జరిగిన అనుభవాన్ని చెబుతాడు. తమకోసం స్వామివారు ఉపవాసం పాటిస్తున్నాడని ఆ వ్యక్తి ఊరంతా ప్రచారం చేస్తాడు. ఆ ఊరు నుంచి పారిపోవాలనుకుంటాడు రాజు. కానీ, కుదరదు! చివరికి తప్పదు అనుకొని నిరాహార దీక్షకు కూర్చుంటాడు.
రోజులు గడుస్తుంటాయి. రాజు మనసులో సంఘర్షణ మొదలవుతుంది. వారం గడుస్తుంది. రాజును వెతుక్కుంటూ అతని తల్లి అక్కడికి వస్తుంది. అదే సమయంలో రాజు భార్య రోజి కూడా వస్తుంది. తుంచుకున్న బంధాలు మళ్లీ పంచుకునేందుకు సిద్ధంగా ఉండడు రాజు. దీక్షలోనే ఉండిపోతాడు. రోజురోజుకూ అతని ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. పన్నెండో రోజు రానే వస్తుంది. ఆకలితో కన్నుమూసిన పసివాణ్ని పట్టుకొని రాజు దగ్గరికి వస్తారు భక్తులు. అన్యాయం జరిగిపోయిందని బావురుమంటారు. ఉపవాస దీక్షతో, మానసిక సంఘర్షణతో తనను తాను శుద్ధి చేసుకున్న రాజు.. ‘నా ప్రాణాలు తీసుకొని ఆ పసివాణ్ని బతికించు’ అని భగవంతుణ్ని ప్రార్థిస్తాడు.
ఆ పసివాడు బతుకుతాడు. ఏ శక్తి లేని రాజు మహిమాన్వితుడు అయిపోతాడు. మనసులో దైవాన్ని దర్శించిన రాజు తెలియని ఆనందానికి లోనవుతాడు. గ్రామస్తులంతా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతని చుట్టూ చేరుతారు. ఇంతలో ఉరుములు, మెరుపులు. ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నంతగా వర్షం మొదలవుతుంది. అందరిలోనూ హర్షాతిరేకాలు! వానలో తడిసి ముద్దయిన రోజి.. రాజు దగ్గరికి వెళ్తుంది. ‘రాజు.. నీ దీక్ష ఫలించింది.. చూడు ఎంత భారీగా వర్షం పడుతుందో’ అని తట్టి లేపుతుంది. కానీ, రాజు కదలడు. అప్పటికే.. అతని ఆత్మ, ఆ పరమాత్మలో లీనమైపోతుంది!
ఇంతే ‘గైడ్’ సినిమా! ఇలాంటి సినిమా ఎందుకంత హిట్టయ్యింది అంటే.. ఇందులో ప్రతి సన్నివేశం హృదయాన్ని తాకుతుంది! ప్రతి మాటా మనసును తడుతుంది. ప్రతి పాటా మనోహరంగా సాగుతుంది. ఎస్.డి.బర్మన్ సంగీతం, శైలేంద్ర పాటలు ‘గైడ్’ని కల్ట్ సినిమాగా మార్చేశాయి. రొమాంటిక్ హీరోగా పేరున్న దేవానంద్‌ను మరో పదిమెట్లు పైకి ఎక్కించింది ‘గైడ్’. వహీదా రెహమాన్‌లోని నటనా వైచిత్రిని మరోసారి చూపించింది ‘గైడ్’. విజయ్ ఆనంద్ టేకింగ్ ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించింది ‘గైడ్’. అందుకే అరవై ఏండ్లు పూర్తి చేసుకున్న ‘గైడ్’ అప్పట్లో సంచలనం. ఇప్పటికీ… అర్థం చేసుకున్నవారికి అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. పనిగట్టుకొని మరీ చూడండి. మాటలు, పాటలు మనసుతో ఆలకించండి. హృదయంలో పరివర్తన వస్తుంది, మస్తిష్కంలో పరిశోధన మొదలవుతుంది.
ఒకే కథ రెండు భాషల్లో సినిమా తీయడం మామూలే! కానీ, రెండు రకాలుగా తీసిన ఏకైక సినిమా ‘గైడ్’. ఇంగ్లిష్ వెర్షన్ ‘ద గైడ్’లో ఇంత డెప్త్ ఉండదు. రోజి, రాజు అనుబంధాన్ని ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్‌గా, కాస్త పరిధి దాటి చూపించడం, ఇండియన్ సంస్కృతిని గౌరవించే పాశ్చాత్యులకూ మింగుడుపడలేదు! పైగా కాస్టింగ్‌లో తేడాలు, పిక్చరైజేషన్లో వ్యత్యాసాలు ఇంగ్లిష్ వెర్షన్ పరాజయానికి కారణాలు అయ్యాయని సినీ పండితులు విశ్లేషిస్తారు.
– కణ్వస