Govinda | ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. జల్గావ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టేందుకు వచ్చారు. అయితే, ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి.. తిరిగి ముంబయికి చేరుకున్నారు. గోవింద ముక్తైనగర్, బోద్వాడ్, పచోరా, చోప్డాలలో ప్రచారం నిర్వహించేందుకు జల్గావ్కు చేరుకున్నారు. పచోరాలా రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు. రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. అర్ధాంతరంగా రోడ్షోని నిలిపివేసి.. ముంబయికి బయలుదేరి వెళ్లిపోయారు. అయితే, ఛాతిలో నొప్పి వచ్చినట్లు తెలుస్తున్నది.
అయితే, ఇప్పటి వరకు ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. రోడ్‌షోలో ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాలని, బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను గోవింద రోడ్‌షోలో కోరారు. గోవింద కాంగ్రెస్‌కు చెందిన మాజీ లోక్‌సభ ఎంపీ. ప్రస్తుతం ఆయన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఇటీవల గోవింద ఇంట్లో తుపాకీ కారణంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బుల్లెట్ కాలులో నుంచి దూసుకెళ్లింది. ప్రస్తుతం మరోసారి అస్వస్థతకు గురికావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.