Actor Govinda | బాలీవుడ్ నటుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు గోవింద మంగళవారం ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కారణంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుప్రతికి తరలించగా.. వైద్యులు బుల్లెట్‌ను తొలగించారు. ఆ తర్వాత ఆయన అభిమానుల ఆదరాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో తాను క్షేమంగా ఉన్నానన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. వినయ్ ఆనంద్, దీపక్ సావంత్ ఆసుప్రతికి చేరుకున్నారు. అలాగే, గోవింద మేనల్లుడు, కమెడియన్ కృష్ణ అభిషేక్, అతని భార్య సైతం ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. ఆస్పత్రిలో గోవిందను కలిసిన అనంతరం వినయ్ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం గోవింద స్పృహలోనే ఉన్నాడని.. కుటుంబం ఆయన వెంటే ఉందని తెలిపారు.
రివాల్వర్ అతని కాలుపై పడడంతో బుల్లెట్ గాయమైంది. తెల్లవారు జామున 4.45 గంటలకు కోల్‌కతా వెళ్లే ముందు లైసెన్స్డ్ గన్ని పరిశీలిస్తుండగా.. ఒక్కసారిగా జారి కిందపడిపోయింది. దాంతో బుల్లెట్ వేగంగా వేగంగా కాలులోకి దూసుకెళ్లింది. భారీగా రక్తస్రావం కాగా.. వెంటనే కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. గోవిందకు చికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ రమేశ్ అగర్వాల్ మాట్లాడుతూ ఉదయం 5గంటల సమయంలో గోవింద ఆసుపత్రికి వచ్చారన్నారు. 6 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లామన్నారు. బుల్లెట్‌ను తొలగించేందుకు గంటన్నర సమయం పట్టిందన్నారు. ఎముకలోకి బుల్లెట్ చొచ్చుకువెళ్లిందన్నారు. మూడు నెలల నుంచి నాలుగు నెలల పాటు గోవింద విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాలికి తీవ్ర గాయమైందని.. దాంతో కాలుపై ఎక్కువగా బరువును మోపలేరన్నారు.