Govinda Divorce | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వివాహ జీవితంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయన భార్య సునీతా అహుజా 38 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని కోర్టును ఆశ్రయించారు. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13 (1)(i), (ia), (ib) ప్రకారం విడాకుల కోసం ఆమె పిటిషన్ దాఖలు చేశారు. సునీతా తన పిటిషన్లో గోవిందాపై అక్రమ సంబంధం, శారీరక మరియు మానసిక హింస వంటి ఆరోపణలు చేసింది. గత కొన్ని నెలలుగా ఇద్దరూ వేరుగా ఉంటున్నారని సమాచారం. గోవిందా ముంబయిలోని బంగ్లాలో ఉంటుండగా, సునీతా అదే బంగ్లాకు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో జీవిస్తున్నట్లు తెలిసింది.
ఈ కేసు విషయంలో మే 25న గోవిందాకు సమన్లు జారీ కాగా, జూన్ నుంచి విచారణ ప్రారంభమైందని సమాచారం. అయితే సునీతా తరుచుగా కోర్టుకు హాజరవుతుండగా, గోవిందా మాత్రం విచారణలకు హాజరు కావడం లేదని తెలిసింది. కొన్నిరోజుల క్రితం తన యూట్యూబ్ వ్లాగ్ ద్వారా సునీతా తన మనోవేదనను వ్యక్తం చేసింది. “గోవిందాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇద్దరు బిడ్డలు దేవత ప్రసాదంగా పుట్టారు. కానీ జీవితంలో ప్రతీ విషయం తియ్యగా ఉండదు. ఈ రోజు నేను ఎదుర్కొంటున్న బాధ నుంచి దేవీ కాళీ నన్ను కాపాడుతుందని నమ్ముతున్నా” అంటూ తన బాధను బయటపెట్టింది.
అంతేకాక, “ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి మహిళను ఇంతలా బాధ పెట్టడం సరైనది కాదు. నా కుటుంబాన్ని విచ్చిన్నం చేయాలనుకునేవారిని దేవత వదిలిపెట్టదు” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించింది. గోవిందా 30 ఏళ్ల మరాఠీ నటితో సన్నిహితంగా ఉన్నట్టు గతంలో ప్రచారం జరిగింది. ఆమె వల్లే గోవిందా, సునీతా మధ్య దూరం పెరిగిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒకానొక సమయంలో ఎక్కడికైనా భార్యను వెంట తీసుకెళ్లే గోవిందా, గత కొన్ని నెలలుగా ఆమెతో కలిసి పబ్లిక్‌లో కనిపించకపోవడం ఈ ప్రచారాలకు బలం చేకూర్చింది. సునీతా, గోవిందా 1987లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గోవిందా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో పెళ్లి విషయాన్ని నాలుగేళ్ల పాటు గోప్యంగా ఉంచారు. కుమార్తె నర్మదా (టీనా) అహుజా జననంతో పాటు తమ వివాహాన్ని బహిర్గతం చేశారు.
ఈ పరిణామాల మధ్య, గోవిందా తరఫు న్యాయవాది లలిత్ బింద్రా స్పందిస్తూ సరికొత్త వాదన వినిపించారు. వారిద్దరి మధ్య సమస్యలేమి లేవు. అంతా బాగానే ఉంది. కావాలనే ఎవరో పాత విషయాలని తెరపైకి తెచ్చారు. గణేష్ చతుర్థికి మీరందరూ వారిని జంటగా చూస్తారు అని ఆయన ఓ జాతీయ మీడియాతో అన్నారు.