17 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సినీకార్మికుల సమ్మె బుధవారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు ఈ సమ్మె అడ్డంకిగా మారిందంటూ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి, సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని వినికిడి. ఈ సమ్మె ప్రభావం ఇతర భాషా చిత్రాల షూటింగులపై కూడా పడిందని, హైదరాబాద్‌లో జరిగే ఇతర భాషా చిత్రాల షూటింగులు ఈ సమ్మె కారణంగా ఆగిపోయాయని, దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించినట్టు తెలిసింది. ఫిల్మ్‌ఛాంబర్ సభ్యులతో ఇప్పటికే చర్చించిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో కూడా బుధవారం చర్చలు జరిపారు.
30శాతం వేతనాలు పెంచడం వల్ల నిర్మాతలకు ఆర్థిక భారం మరింత అవుతుందని, ఈ విషయంలో ఫెడరేషన్ పునరాలోచన చేయాలనీ, ఇరు వర్గాలకూ సముచితమైన నిర్ణయాన్ని తీసుకొని వెంటనే షూటింగులు మొదలుపెట్టాలని ఫెడరేషన్‌కు ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు సమాచారం. డీజీపీ మహంతి ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగినట్టు తెలిసింది. ఫెడరేషన్ తరఫున సెక్రటరీ అమ్మిరాజు, కోశాధికారి అలెగ్జాండర్ ఈ భేటీలో పాల్గొన్నారట. బుధవారం జరగాల్సిన ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ చర్చలు నేటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ జోక్యం వల్ల కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.