Tollywood | వినాయక చవితి పర్వదినం తెలుగు చిత్రసీమకు కొత్త శోభను తీసుకొచ్చింది. తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటూ పలువురు సినీ తారలు, దర్శకనిర్మాతలు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న పలు సినిమాల తాజా అప్డేట్స్ వెలువడ్డాయి. కొత్త పోస్టర్స్ అభిమానులను అలరించాయి.
క్రిస్మస్కు ‘సైంధవ్’
వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. సోమవారం విడుదల చేసిన కొత్త పోస్టర్లో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా ఫ్యామిలీ టైంను ఆస్వాదిస్తూ ఆనందంగా కనిపిస్తున్నారు. పోలీస్, గ్యాంగ్‌స్టర్ నేపథ్య కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేశామని చిత్రబృందం పేర్కొంది. డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది.
ఏ మాయ చేశావే..
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ఉపశీర్షిక. స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయిక. ఈ సినిమాలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో హీరో కల్యాణ్‌రామ్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏ మాయ చేసే..’ అనే పాటను విడుదల చేశారు. హర్షవర్దన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటను సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. ‘అద్భుతమైన మెలోడీ సాంగ్ ఇది. ఇందులో నాయకానాయికలు కల్యాణ్‌రామ్, సంయుక్త మీనన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. విజువల్స్ కూడా కట్టిపడేస్తాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్ ఎన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా.
21న సెకండ్ సింగిల్
రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలకానుంది. ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో రవితేజ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. 70 దశకంలో స్టూవర్టుపురానికి చెందిన పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.
మాస్‌బీట్‌తో ‘కల్ట్మామా’
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. శ్రీలీల, సాయి మంజ్రేకర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. సోమవారం ‘కల్ట్మామా’ అనే మాస్ గీతాన్ని విడుదల చేశారు. హుషారెత్తించే మాస్ బీట్తో సాగిన ఈ గీతంలో హీరో రామ్, ఉర్వశి రౌతేలా నృత్యాలు ప్రధానాకర్షణగా నిలిచాయి. తమన్ స్వరపరచిన ఈ గీతాన్ని అనంత్‌శ్రీరామ్ రచించగా..మహా, రమ్య బెహరా ఆలపించారు.
28న ‘యానిమల్’ టీజర్
రణ్‌బీర్‌కపూర్ కథానాయకుడిగా ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘యానిమల్’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో హీరో రణ్‌బీర్‌కపూర్ గుబురు గడ్డంతో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని..యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన చిత్రమిదని దర్శకుడు తెలిపారు.
గ్రాఫిక్స్ హంగులతో ‘హను-మాన్’
ప్రశాంత్‌వర్మ హీరోగా తేజ సజ్జా దర్శత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అమృత అయ్యర్ కథానాయిక.సోమవారం విడుదల చేసిన కొత్త పోస్టర్లో హీరో తేజ సజ్జ వినాయక విగ్రహాన్ని తన భుజంపై మోస్తూ భక్తి భావంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నదని, అంజనాద్రి అనే ఊహాత్మక ప్రపంచంలో జరిగే ఈ కథ హనుమాన్ శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం పేర్కొంది.