బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే! ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపిక చరిత్ర సృష్టించగా.. అది నెట్టింట్లో కొత్త చర్చకు దారితీసింది. దీపికకు ఈ అరుదైన గౌరవం లభించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తంచేస్తూ.. ఆమెకు ‘కంగ్రాట్స్’ చెబుతున్నారు. కొందరు మాత్రం లేనిపోని విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ నటి ఫ్రిదా పింటో.. సదరు విమర్శకులకు గట్టి కౌంటర్ ఇస్తూ, దీపికకు సపోర్ట్‌గా నిలిచింది. దీపిక కన్నా ముందు.. ఇర్ఫాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లాంటి పలువురు భారతీయ నటులు హాలీవుడ్లో మంచిమంచి సినిమాలు చేశారనీ, వారికే ముందుగా ఈ గౌరవం దక్కాలన్నది విమర్శకుల వాదన. దీపిక ఒకేఒక్క హాలీవుడ్ సినిమాలో కనిపించిందనీ, అదికూడా పెద్దగా ఆడలేదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఈ విమర్శలను ఫ్రిదా పింటో తిప్పికొడుతూ.. ‘దీపిక కేవలం బాలీవుడ్ నటి మాత్రమే కాదు. ఆమె లూయిస్ విట్టన్, కార్టియర్ లాంటి ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్లకు అంబాసిడర్. 2022 ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగానూ సేవలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు’ అంటూ దీపిక మైలురాళ్లను గుర్తుచేసింది. దయచేసి ఎవరినీ కించపరచకూడదనీ, ఇలాంటి విమర్శలు.. కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులను ఏమీ చేయలేవనీ రాసుకొచ్చింది. ‘ఓ భారతీయ మహిళ.. ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ అంశం.. లేనిపోని చర్చకు దారితీయాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చింది.
‘కంగ్రాట్స్ దీపికా! నువ్వు ఈ గుర్తింపునకు పూర్తి అర్హురాలివి’ అంటూ ముగించింది. ముంబైలో పుట్టిపెరిగిన ఫ్రిదా సెలీనా పింటో.. హాలీవుడ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో హాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఏకంగా ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నది. ఈ చిత్రానికి గాను ఫ్రిదా ఉత్తమ సహాయ నటిగా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుకు కూడా ఎంపికైంది. ఆ తర్వాత మిరాల్, తృష్ణ, డెజర్ట్ డ్యాన్సర్, రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.