ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్
సోనీ లివ్: స్ట్రీమింగ్ అవుతున్నది
నటీనటులు: చిరాగ్ వోహ్రా, సిద్ధాంత్ గుప్త, రాజేంద్ర చావ్లా, ఆరీఫ్ జకారియా
దర్శకుడు: నిఖిల్ అడ్వాణీ
చరిత్రను పెనవేసుకున్న గాథలు ఓటీటీలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సోనీ లివ్ చేస్తున్న వెబ్ సిరీస్ ప్రయోగాలు ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేస్తున్నాయి. హర్షద్ మెహతా స్టాక్‌మార్కెట్ కుంభకోణంపై నిర్మించిన 1992 స్కామ్, స్వతంత్ర భారతంలో తొలితరం శాస్త్రవేత్తలు సతీశ్ ధావన్, హోమీ భాభా జీవిత చరిత్రల ఆధారంగా నిర్మించిన రాకెట్ బాయ్స్, తెల్గీ స్కామ్ వెబ్ సిరీస్‌లు.. సోనీ లివ్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. తాజాగా ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ కూడా రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించే క్రమంలో దేశవిభజనకు దారి తీసిన పరిణామాలు, అప్పుడు జరిగిన రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో ఈ సిరీస్ నిర్మించారు. ఏడు ఎపిసోడ్లు ఆసక్తికరంగా సాగుతాయి.
జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), ముహమ్మద్ అలీ జిన్నా (ఆరిఫ్ జకారియా) ప్రధాన పాత్రలుగా కనిపిస్తారు. గాంధీ, నెహ్రూ, పటేల్ మధ్య జరిగే చర్చలు ఆసక్తికరంగా సాగుతాయి. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురి దృక్పథాల్లో ఎలాంటి వైవిధ్యం ఉన్నదో ఈ సిరీస్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ముస్లిం లీగ్ ప్రతినిధిగా, మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించాలన్న జిన్నా డిమాండ్ చేయడంతో కథ రసవత్తరంగా మారుతుంది. ముఖ్యంగా ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. కథనం అక్కడక్కడా నెమ్మదించినా భావోద్వేగంగా ఉంటుంది. 1944-47 మధ్య జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యాన్ని ఎంచుకొని దానిని పకడ్బందీగా
చూపించడంలో దర్శకుడు నిఖిల్ అడ్వాణీ కృతకృత్యుడు అయ్యాడు. అయితే చరిత్రపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ఇందులోని లోటుపాట్లు అర్థమవుతాయి. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్! కాకపోతే, కొత్త విషయాలు తెలుసుకున్నామన్న సంతృప్తి మిగులుతుంది.