అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ వర్ధిల్లాంటే ప్రేక్షకులను మెప్పించి, రప్పించేవిధంగా సినిమాలు తీయాలని ప్రముఖ నిర్మాణ సురేష్‌బాబు (Producer Suresh Babu ) పేర్కొన్నారు. బుధవారం దర్శకుడు మలినేని గోపీచంద్(Gopichand) , సంగీత దర్శకుడు తమన్(Taman) తో కలిసి తిరుమల (Tirumala) లో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ టికెట్ రేట్ పెంచడం కన్నా ఎక్కువ మంది సినిమాలు చూసే విధంగా ధరలు అందుబాటులో ఉండాలని అన్నారు. చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని , వారిని థియేటర్లకు రప్పించే విధంగా చిత్ర నిర్మాణాలు జరగాలని సూచించారు. దీని వల్ల సినిమా రంగం, థియేటర్లకు మేలు జరిగి అనేక మంది ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.